ఒకటి నుంచి నెల్లూరులో డివైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా సెప్టెంబరు ఒకటి నుంచి మూడో తేదీ వరకు నెల్లూరులో నిర్వహించనున్న డివైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూసిన జాబ్ కేలండర్‌లో కేవలం 10,060 పోస్టులు ప్రకటించడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. మంత్రి లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని, ప్రతియేటా జాబ్ కేలండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు సుమారు 16 వేల పోస్టులతో ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్ మినహా ఇతర నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదన్నారు. ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను 11,639 పెంచకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. డిఎస్‌సి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతున్నందున ఉద్యోగాల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో పెద్ద కార్పొరేట్ సంస్థలకు వేలాది ఎకరాల భూములు సేకరించి ఇస్తున్నా, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీల అమలు, ఖాళీ పోస్టుల భర్తీ, యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియా నిర్మూలన కోసం రాబోయే కాలంలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువత హక్కులు, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలపై నెల్లూరు రాష్ట్ర మహాసభల్లో విస్తృతంగా చర్చిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరనాల శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఎఫ్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహ, అబ్దుల్లా రాఘవేంద్ర, చిన్ని, శివ, పిచ్చయ్య, కృష్ణకాంత్, ఆంజనేయరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)