మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రియాంక కేసులో నిందితుల బెయిల్‌పై తీర్పు 28కి వాయిదా

1 గంట క్రితం

Priyanka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 09:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం సిటీ : డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌‌పై తీర్పును న్యాయమూర్తి ఈ నెల 28కి వాయిదా వేశారు.ఈ కేసులో నిందితులైన సురవరపు దస్వంత్, దేశాబత్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌‌పై జిల్లా కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. బెయిల్‌‌పై ఈ నెల 28న ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ నెల 3న జిల్లాలోని ప్రసాదిత్య మాల్ వద్ద డాక్టర్ ప్రియాంక స్నేహితునితో స్కూటర్‌‌పై వెళుతున్న సమయంలో మద్యం సేవించి ఉన్న దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్‌‌లు కారుతో వారి వాహనాన్ని రెండుసార్లు ఢీకొట్టారు. కింద పడిన డాక్టర్ ప్రియాంక తల మీదుగా కారును పోనివ్వడంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. దీంతో ఎట్టకేలకు నిందితులను పోలీసులు ఈ నెల 8న అరెస్టు చేశారు. అప్పటి నుంచి నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

​పారదర్శకంగా దర్యాప్తు జరపాలి : ప్రియాంక కుటుంబ సభ్యుల డిమాండ్‌

​తన కుమార్తె డాక్టర్‌ ప్రియాంక దుర్మరణం చెందిన కేసులో ఎలాంటి రాజకీయ, ఇతర ప్రలోభాలకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రియాంక తండ్రి వెంకటేష్‌, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌ ‌నగర్‌ ‌పోలీసులను మంగళవారం వారు కలిశారు. అనంతరం వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిందితులకు మరణశిక్ష పడాలని కోరుకుంటున్నామన్నారు. న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి మాల్‌ యాజమాన్యం తమ కుటుంబాన్ని సంప్రదించకపోవడం, ఎలాంటి నివేదిక ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. దీనిపై కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మరెవరికీ జరగకుండా ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టులో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష వేసి సమాజానికి గట్టి సందేశం ఇవ్వాలని కోరారు. సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి తమ సమస్యను వివరిస్తామని తెలిపారు. దర్యాప్తు తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగినా, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోయినా మళ్లీ రాజమహేంద్రవరానికి వచ్చి ప్రజా సంఘాలు, ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ తదితర సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్