ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారత నౌకాదళంలో మరో కీలక స్వదేశీ నౌక చేరనుంది. నిస్తార్ తరగతికి చెందిన రెండో డైవింగ్ సపోర్ట్ వెసల్ ‘నిపుణ్’ను ఈ నెల 31న నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ నౌక చేరికతో భారత నౌకాదళ లోతైన సముద్ర డైవింగ్, నీటి అడుగున సహాయక కార్యకలాపాల సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో నిపుణ్‌ను రూపొందించి నిర్మించింది. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా దేశం సాధిస్తున్న పురోగతికి ఈ నౌక నిర్మాణం మరో ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది. విస్తృత స్థాయి పరికరాల అమరిక, పరీక్షలు పూర్తయిన అనంతరం నిపుణ్‌ను జులై 30న భారత నౌకాదళానికి అప్పగించారు.
డైవింగ్, నీటి అడుగున వివిధ కార్యకలాపాలకు అనుగుణంగా నిపుణ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, అండర్‌వాటర్ ఇంటర్వెన్షన్ సామర్థ్యాలతో కూడిన ఈ నౌక సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు దీర్ఘకాలిక సహాయాన్ని అందించగలదు. జలాంతర్గామి రక్షణ కార్యకలాపాలకు కూడా పెంచనుంది.
ఆధునిక నావిగేషన్, ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్, కచ్చితమైన స్థానం నిర్వహణ వ్యవస్థలతో పాటు డైవింగ్, నీటి అడుగున జోక్యం, వైద్య సహాయానికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలు నిపుణ్‌లో ఉన్నాయి.
నిపుణ్ నౌక చిహ్నం ప్రత్యేకత
నిపుణ్ నౌక క్రెస్ట్‌ను డైవింగ్ సపోర్ట్‌ను ప్రతిబింబించేలా రూపొందించారు. అందులోని ‘తిమింగలం’ సముద్రంలో అత్యంత లోతుకు వెళ్లి ఎక్కువసేపు నీటిలో ఉండగల సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది దీర్ఘకాలిక కార్యకలాపాలు, సహనం, నిరంతర సేవకు సంకేతం. క్రెస్ట్‌లోని ‘ఆధునిక డైవింగ్ హెల్మెట్’ డైవర్‌ను, అతని భద్రతకు అవసరమైన ఆధునిక డైవింగ్, లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను సూచిస్తుంది. తిమింగలం, డైవింగ్ హెల్మెట్ కలయికగా నిపుణ్ నౌక డైవర్లను సముద్రపు లోతుల్లోకి తీసుకెళ్లడం, అక్కడ వారికి సహకారం అందించడం, సురక్షితంగా తిరిగి తీసుకురావడం అనే ప్రధాన బాధ్యతను ప్రతిబింబిస్తుంది. నైపుణ్యం, సహనం, వృత్తిపరమైన నిబద్ధతను ఈ క్రెస్ట్ చాటిచెబుతుంది.








కామెంట్‌లు (0)