సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బీఎల్‌ఏలకు ’సర్‌–2026’ డేటా అందేలా చూడాలి

1 గంట క్రితం

voters
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 09:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరిన వైసిపి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ అధీకృత బిఎల్‌ఏలకు ముఖ్యమైన ఎస్‌ఐఆర్‌–2026 డేటా అందడం లేదని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ను కోరారు. ఈ మేరకు సీఈఓకు లేఖ రాసిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ల వారీగా మ్యాప్‌లో లేని ఓటర్ల వివరాలు, వ్యత్యాసాలు, నోటీసుల వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే, వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏ–1, బీఎల్‌ఏ–2లకు ఈ సమాచారాన్ని అందించేలా అన్ని స్ధాయిల్లో ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించేందుకు, తొలగింపులు, వ్యత్యాసాలు లేదా ఇతర సమస్యలు ఉంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైన పూర్తి సమాచారం అధికారుల వద్ద అందుబాటులో ఉండటం లేదని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ సమాచారం తమ పార్టీ ప్రతినిధులకు అత్యంత అవసరమని, అయితే చాలా ప్రాంతాల్లో కోరిన సమాచారాన్ని ఒకే విధంగా అందించడం లేదని ఆయన తన లేఖలో సిఈఓ దృష్టికి తెచ్చారు. తమ బిఎల్‌ఏలు పలుమార్లు కోరినప్పటికీ సంబంధిత డేటా పూర్తిగా, సకాలంలో అందడం లేదని తెలిపారు. పులివెందుల, పుంగనూరు, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్ని అందుకు స్పష్టమైన ఉదాహరణలుగా చూపారు.

ఎస్‌ఐఆర్‌–2026లో మ్యాపింగ్‌ కాని ఓటర్ల వివరాలు, ఉన్న ఓటర్లకు సంబంధించిన బూత్‌ల వారీ డేటాను కోరుతూ వైఎస్సార్సీపీ ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక బృందం కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్డీఓ కార్యాలయాన్ని సంప్రదించగా, వారు కోరిన డేటాను మాత్రం ఇవ్వలేదని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. బూత్‌ల వారీ డేటాను అందించేందుకు తమ కార్యాలయానికి అవసరమైన లాగిన్‌/యాక్సెస్‌ లేదని ఆర్డీఓ తమ పార్టీ ప్రతినిధులకు చెప్పారని తెలిపారు. ఎస్‌ఐఆర్‌–2026 డేటాను అన్ని నియోజకవర్గాల్లో ఒకే విధంగా అందుబాటులో ఉంచేందుకు సిఈఓ కార్యాలయం నుంచి స్పష్టమైన, ఏకరీతి ఆదేశాలు ఇవ్వాలని, లేళ్ల అప్పిరెడ్డి తన లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్డీవోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్