- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం డేటా ఇంటిగ్రేషన్
- డెంగీ, మలేరియా నివారణకు హాట్‌స్పాట్‌ల గుర్తింపు
- సమీక్షలో సిఎం చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుని ఆన్‌లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ సమీక్షలో వివిధ శాఖల పనితీరు, పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు. సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని శాఖలు మరింత సమర్ధత పెంచుకోవాలని, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందించేలా చూడాలని సిఎం ఆదేశించారు. ఇప్పటికే సాగు మొదలు పెట్టని చోట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని నిర్దేశించారు. రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్ అలర్ట్ పంపడంతో పాటు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇందుకోసం ఎపిటిఎస్ అనలిటిక్స్ కూడా వినియోగించుకుని... అవేర్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. తాగునీటి వరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. అదేవిధంగా మలేరియా, డెంగీ కేసుల నివారణకు హాట్ స్పాట్‌లు గుర్తించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది ఇదే సమయానికి 1,361 డెంగీ కేసులు నమోదైతే... ఈ ఏడాది ఇప్పటికి 401 కేసులు నమోదైనట్టు అధికారులు సిఎంకు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెన్యువబుల్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సోలార్ రూఫ్ టాప్‌లు పెద్దఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.








కామెంట్‌లు (0)