సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తాగునీటి కోసం నిధుల వినియోగంలో వెసులుబాటు

1 గంట క్రితం

panchayat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 10:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల సాధారణ నిధుల వినియోగంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు 2028 డిసెంబర్‌ వరకు కొనసాగనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ ‌దండే సోమవారం ఉత్తర్వలు జారీ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు ఏర్పడటం, ముఖ్యంగా ఎస్సి, ఎస్టి ఆవాసాల్లో తాగునీటి ఇబ్బందులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ‌జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల సాధారణ నిధుల్లో 23 శాతం నిధులను ఇకపై తాగునీటి ఆస్తుల అభివృద్ధి, నిర్వహణ, పునరుద్ధరణతో పాటు చిన్నతరహా సాగునీటి వనరులకు వినియోగించవచ్చు. రహదారులు, సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, ప్రహరీ గోడల వంటి అనేక పనులకు ఇప్పటికే ఇతర కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా నిధులు అందుతున్నందున తాగునీటి ఆస్తుల నిర్వహణకు నిధుల కొరత ఏర్పడుతోందని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి నివేదించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సిల సంక్షేమానికి కేటాయించిన 15 శాతం, ఎస్టిల సంక్షేమానికి కేటాయించిన 6 శాతం నిధులను వారి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాధ్యమైనంత వరకు ఎస్సి, ఎస్టి ఆవాసాల్లో రక్షిత తాగునీటి సదుపాయాల కల్పన, తాగునీటి ఆస్తుల నిర్మాణం, నిర్వహణకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. అదేవిధంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి కేటాయించిన 15 శాతం నిధులు యథాతథంగా కొనసాగనున్నాయి. కార్యాలయ నిర్వహణ, పరికరాలు, సిబ్బంది వ్యయాలకు కేటాయించిన 15 శాతం, అనుకోని పరిస్థితులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించిన 4 శాతం, ఆరోగ్యం, విద్య, సంక్షేమం, వ్యవసాయం, పశుసంవర్థక తదితర రంగాలకు కేటాయించిన 10 శాతం నిధుల్లో ఖర్చు చేయకుండా మిగిలిన మొత్తాన్ని కూడా తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం కల్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్