సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన సంస్కృతితో పాటు విద్య, ఉపాధికి ప్రాధాన్యత

10 ఆగస్టు, 2026

sasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కార్యదర్శి మల్లిఖార్జున నాయక్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నృత్య రీతులను పరిరక్షించడంతో పాటు గిరిజన విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్ పేర్కొన్నారు. గిరిజన సంస్కృతిని కాపాడుకుంటూనే ఆధునిక విద్యను అభ్యసించడం ద్వారా గిరిజనుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన - శిక్షణ మిషన్ ఆధ్వర్యంలో సోమవారం రెండో రోజు ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్, ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున నాయక్ మాట్లాడుతూ.. గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గిరిజన కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు సాధించడంలో గిరిజన సంక్షేమ శాఖ చేసిన కృషిని ఆయన అభినందించారు. ఇతర గిరిజన నృత్యాలు, కళారూపాలకు కూడా అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ట్రైబల్ రీసెర్చ్ మిషన్ ద్వారా రాష్ట్రంలోని గిరిజన కళాకారుల పూర్తి వివరాలతో డేటాబేస్ రూపొందించడంతో పాటు సంప్రదాయ సంగీత వాయిద్యాలను సేకరించి భద్రపరుస్తామని తెలిపారు. వర్ధమాన కళాకారులు, శిక్షకులకు అవసరమైన శిక్షణ అందించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తామన్నారు. గురుకులాల కార్యదర్శి గౌతమి మాట్లాడుతూ.. గురుకులాల ద్వారా విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే గురుకులాల్లో ప్రవేశాలు 10 శాతం పెరిగాయని, వచ్చే ఏడాది వాటిని 25 శాతానికి పైగా పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్