రాయితీ ధరతో ఉల్లి, కందిపప్పు, పామాయిల్
మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా రాయితీ ధరతో ఎంపిక చేసిన నిత్యావసర సరుకులను విక్రయించనున్నట్లు ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అందులో భాగంగా ఉల్లి కిలో రూ.32 చొప్పున అందిస్తామని తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర పౌర సరఫరాలశాఖ, నేషనల్ కో-ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్) అధికారులతో జరిగిన సమావేశాల్లో రాయితీ ధరలకు ఉల్లి, కందిపప్పు, పామాయిల్ సరఫరాపై సానుకూల స్పందన లభించిందన్నారు. కేంద్ర ధరల స్థిరీకరణ నిధి (పిఎస్‌ఎఫ్) ద్వారా వచ్చే వారం నుంచి కిలో ఉల్లిని రూ.32కు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉల్లితోపాటు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు, 86,400 కిలోలీటర్ల పామాయిల్‌ను రాయితీ ధరలకు సరఫరా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 1.46 లక్షల కుటుంబాలకు చౌకధరల డిపోల ద్వారా వీటిని అందిస్తామన్నారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే 30 శాతం తక్కువకే నిత్యావసర సరకులు లభించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వినియోగదారులకు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న 1,000 ‘మీ మార్టు’లను ఎన్‌సిసిఎఫ్‌తో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. మరో 130 మీ మార్టులు సిద్ధమైన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామన్నారు.








కామెంట్‌లు (0)