ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలి

31 జులై, 2026

sajjala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 09:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రతి కార్యకర్తా వన్‌ మ్యాన్‌ ఆర్మీలా పని చేయాలని, వైసిపి రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సోషల్‌ మీడియా విభాగ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులతో ముఖ్య సమావేశం జరిగింది. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ అసభ్య పదజాలం, మార్ఫింగ్‌ కంటెంట్‌కు తావివ్వకూడదని, ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టాలని అన్నారు. గ్రామస్థాయి నుంచి సోషల్‌ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని, అక్రమ కేసులు, వేధింపులన్నీ ‘డిజిటల్‌ డైరీ’ లో నమోదు చేయాలని తెలిపారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వివరణలు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రశ్నించేస్థితికి రావాలని అన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణలోని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలని, రూ.9,500 కోట్లకు పైగా ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు విడుదల చేయాలని కోరారు. తప్పుడు ఫిర్యాదులు చేసే వారి వివరాలను కూడా రికార్డు చేస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ ’వైఎస్సార్సీపీ టాక్స్‌’ వంటి డిజిటల్‌ వేదికలను ఏర్పాటు చేసి, స్థానిక కంటెంట్‌ క్రియేటర్లను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. పార్టీ మీడియా వ్యవహారాల ఇన్‌‌ఛార్జి పూడి శ్రీహరి మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో టీడీపీ నెట్‌వర్క్‌ కంటే వైసిపి బలంగా ఉందని అన్నారు. ప్రభుత్వం వ్యాప్తి చేసే అబద్ధాలను, నెగెటివ్‌ నేరేషన్‌ను గుర్తించి మొదటి రెండు గంటల్లోనే వాస్తవ ఆధారాలతో కౌంటర్‌ ఇవ్వడం ప్రధాన వ్యూహంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2025 మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, పరీక్షల నిర్వహణలోని పారదర్శకత లోపంపై కేంద్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండు చేశారు. అమరావతి రీజనల్‌ ఇంబ్యాలెన్స్, రైతులకు మద్దతు ధర లేకపోవడం వంటి సమస్యలపై ఆధారాలతో సహా కంటెంట్‌తో ప్రజలకు వివరించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్