శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్ర‌తి విద్యార్థికీ త‌ల్లికివంద‌నం అమ‌లు చేయాలి

1 గంట క్రితం

ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 10:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అడ్డ‌గోలు నిబంధ‌న‌ల‌తో ఇబ్బంది పెడితే స‌హించేది లేదు

- వైసిపి బీసీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ర‌మేష్ గౌడ్

అమరావతి : అర్హత ఉన్న ప్ర‌తి విద్యార్థికీ త‌ల్లికి వంద‌నం అమ‌లు చేయాలని, అడ్డ‌గోలు నిబంధ‌న‌ల‌తో ఇబ్బంది పెడితే స‌హించేది లేదని, విద్యార్థుల‌ను మోసం చేస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని వైసిపి బీసీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ర‌మేష్ గౌడ్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డ‌బ్బు లేదన్న కార‌ణంతో ఏ ఒక్క పేద విద్యార్థి చ‌దువుల‌కు దూరం కాకూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో దేశంలో ఎవ‌రూ చేయ‌ని విధంగా వైఎస్ జ‌గ‌న్ అమ్మ ఒడి ప‌థ‌కాన్ని తీసుకొచ్చి అమ‌లు చేసి చూపించారని అన్నారు. అలాంటి ప‌థ‌కాన్ని కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక నీరుగార్చేసింద‌ని, మొద‌టి ఏడాది పూర్తిగా వ‌దిలేసి రెండో ఏడాది అర‌కొర‌గా అమ‌లు చేసింద‌ని విమ‌ర్శించారు. యూడైస్ డేటా ప్ర‌కారం రాష్ట్రంలో మొత్తం 87 ల‌క్ష‌ల మంది విద్యార్థులున్నారని తెలిపారు. వారికి రూ. 15 వేల చొప్పున రూ. 13,112 కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉండ‌గా, ప్ర‌భుత్వం 66 లక్ష‌ల మందికి రూ. 10,126 కోట్లు మాత్ర‌మే చెల్లిస్తామ‌ని చెప్ప‌డం విద్యార్థుల‌ను వంచించ‌డ‌మే అవుతుంద‌న్నారు. త‌ల్లికి వందనం అనేది ఒక ప‌థ‌కంగా కాకుండా పేద విద్యార్థుల త‌ల‌రాత‌లు మార్చే విద్యావిప్ల‌వంగా చూడాల‌ని సూచించారు. ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం ఎలాంటి ష‌ర‌తులూ లేకుండా త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వ‌చ్చాక తొలి ఏడాది ప‌థ‌కానికి పూర్తిగా మంగ‌ళం పాడేశారని విమర్శించారు. 87 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఒక్కొక్క‌రికి రూ. 15 వేల చొప్పున చెల్లిస్తే ఏడాదికి రూ. 13,112 కోట్లు అవ‌స‌రమని, మూడేళ్ల‌లో ఈ ప‌థ‌కానికి రూ. 39 వేల కోట్లు అవ‌స‌రం కాగా, ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది రూ. 17 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. పేద విద్యార్థుల‌కు దాదాపు రూ. 22 వేల కోట్లు బ‌కాయిలు పెట్టారని విమర్శించారు. పేద విద్యార్థుల భ‌విష్య‌త్తు ప్రభుత్వానికి ప‌ట్టడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఈ పథకాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా అర్హ‌త ఉన్న ప్ర‌తి విద్యార్థికి బేష‌ర‌తుగా అమ‌లు చేయాలని రమేష్‌ ‌గౌడ్‌ ‌కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్