శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

1 గంట క్రితం

chief
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 10:58 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌లీసా గిల్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సుదీర్ఘ పోరాటాలు,ఎందరో మహనీయుల ప్రాణ తాగ్యాలు వల్ల దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌లీసా గిల్‌కోరారు. హైకోర్టులో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని శనివారం ఆవిష్కరించి ప్రసంగించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అనుభవిస్తూనే, దేశ పౌరులుగా ప్రాథమిక విధులను అంతే బాధ్యతతో నిర్వర్తించడమే అమరవీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ,సమానత్వం,సామాజిక న్యాయ సూత్రాలను కాపాడటంలో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. సమాజంలో వెనుకబడిన,నిరుపేద, బలహీన వర్గాల హక్కులకు భంగం వాటిల్లిన ప్రతి సందర్భంలోనూ కోర్టులు రక్షణ కవచంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసేలా మన సేవలు ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది 4 లోక్ అదాలత్‌ల ద్వారా ఏకంగా 13,95,017 కేసులను సామరస్యంగా పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు సోలిసిటర్‌ ‌జనరల్‌ ‌చల్లా ధనుంజయ్‌, అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌దమ్మాలపాటి శ్రీనివాస్, ఎపి బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి,ఏపీ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభునాథ్ వాసిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

దేశ భవిష్యత్తు యువతపై ఉంది: మండలి చైర్మన్‌ ‌మోషేన్‌ ‌రాజు

దేశ భవిష్యత్తు కుల, మత, రాజకీయ భేదాలపై కాకుండా యువత శక్తి, ప్రతిభ, నైపుణ్యాలపై ఆధారపడి ఉందని శాసనమండలి చైర్మన్‌ ‌కొయ్యే మోషేన్‌ ‌రాజు అన్నారు. శాసనమండలి ప్రాంగణంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు.​ స్వాతంత్ర్యం అంటే కేవలం అధికార మార్పిడి కాదని, సమాజంలోని చివరి వ్యక్తికి సమాన అవకాశాలు, ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందినప్పుడే నిజమైన అర్థం చేకూరుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయినా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బందులు పడటం ఆవేదన కలిగిస్తోందన్నారు. కులం, మతం, ప్రాంతీయ విభేదాలను పక్కనబెట్టి “ముందుగా మనం భారతీయులం” అనే భావనతో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి:శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

​ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని శాసన సభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శాసనసభ ప్రాంగణంలో జరిగిన స్వాతంత్ర దినోతవ్స వేడుకలు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల అపారమైన త్యాగాలు, పోరాటాల ఫలితం స్వాతంత్ర్యం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, వారు ఎన్నుకున్న చట్టసభల పనితీరును తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని అన్నారు. ఈ ఉద్దేశంతో శాసనసభ కార్యకలాపాలను ప్రజలకు, విద్యార్థులకు ప్రత్యక్షంగా పరిచయం చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ డిప్యుటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకటరావు, శాసన సభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సచివాలయంలో జాతీయ జెండాను సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ముఖ్యంగా ఉద్యోగులందరూ మరింత చిత్తశుద్ధి అంకిత భావాలతో ఉండాలని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చేందుకు అనేక మంది మహనీయులు ప్రాణ త్యాగాలు చేశారని, వారి త్యాగాలను అందరం స్మరించుకోవాలని చెప్పారు. సమాజంలోని పేదల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి సంక్షేమ పధకాలను పెద్దఎత్తున అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. ఆయా పధకాల లబ్దిని గ్రామ స్థాయి వరకూ అర్హులైన ప్రతి ఒక్కరికి సక్రమంగా చేరేలా చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ముఖ్య భధ్రతాధికారి మల్లిఖార్జున,సచివాలయ ప్రోటోకాల్ విభాగం ఉప కార్యదర్శి రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్