ప్రజాశక్తి-అమరావతి : వైవాహిక వివాదాలు, వరకట్న వేధింపుల వంటి రాజీకి వీల్లేని నేరాల్లోనూ, కేసు స్వభావం, తీవ్రత, ఇరుపక్షాల మధ్య కుదిరిన రాజీ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తగిన సందర్భాల్లో క్రిమినల్ కేసులను కొట్టివేసే అధికారం తమకు ఉందని హైకోర్టు పేర్కొంది. భార్య లేదా భర్త కేసు విషయంలో రాజీ చేసుకున్నట్టు చెప్పినప్పటికీ అందుకనుగుణంగా వరకట్న వేధింపులు కేసును కొట్టివేయాలని లేదని తేల్చి చెప్పింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్) సెక్షన్ 528 కింద తనకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను వినియోగించి, వివాహ సంబంధ వివాదాల్లో ఇరుపక్షాలు స్వచ్ఛందంగా రాజీకి వచ్చినప్పుడు కేసులను కొట్టివేయవచ్చని స్పష్టం చేసింది. భార్యను భర్త, అతని కుటుంబ సభ్యులు వేధించకుండా నిరోధించడమే ఐపిసి సెక్షన్ 498ఏ ప్రధాన ఉద్దేశమని, నిజమైన వేధింపుల కేసుల్లో రాజీ ద్వారా నేర తీవ్రతను తగ్గించకుండా ఉండేందుకు ఆ నేరాన్ని రాజీకి వీల్లేని నేరాల జాబితాలో చేర్చారని పేర్కొంది.
అయితే ప్రతి కేసులోనూ రాజీని అంగీకరించి కేసును కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. నేర స్వభావం, తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, రాజీ స్వచ్ఛందంగా జరిగిందా లేదా తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది.శ్రీకాకుళం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న వరకట్న వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా భార్య స్వయంగా హైకోర్టుకు హాజరై, ఇరుపక్షాలు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నాయని, తాను స్వచ్ఛందంగానే కేసులో రాజీకి అంగీకరించానని అఫిడవిట్ సమర్పించారు.
ఇరుపక్షాల మధ్య కుదిరిన రాజీ, కేసు స్వభావం తదితర అంశాలను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు శ్రీకాకుళం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు.








కామెంట్‌లు (0)