నమోదుకు నవంబరు 6 గడువు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా పునరుద్ధరణకు షెడ్యూల్ విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు నవంబరు 6వ తేదీలోగా ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో సూచించారు. భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) ఈ నెల 9న జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. 2026 నవంబరు ఒకటో తేదీని అర్హత తేదీగా నిర్ణయించారు. సంబంధిత ఉపాధ్యాయ నియోజకవర్గంలో సాధారణ నివాసం ఉండటంతోపాటు, అర్హత తేదీకి ముందు ఆరేళ్లలో కనీసం మూడేళ్లు ప్రభుత్వం గుర్తించిన సెకండరీ స్థాయి లేదా అంతకంటే ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో బోధించిన అనుభవం ఉన్నవారు ఓటరు నమోదుకు అర్హులు. పూర్తికాల, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉపాధ్యాయులు అర్హులు కాగా, పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి అర్హత ఉండదు. విద్యాసంస్థ ఉన్న ప్రాంతం కాకుండా ఉపాధ్యాయుడి సాధారణ నివాస ప్రాంతం ఆధారంగా నియోజకవర్గాన్ని నిర్ణయిస్తారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 27, ఓటర్ల నమోదు నిబంధనలు-1960లోని రూల్ 31 ప్రకారం ఉపాధ్యాయ ఓటర్ల జాబితాను అసెంబ్లీ ఓటర్ల జాబితా నుంచి వేరుగా రూపొందిస్తారు. దరఖాస్తులను గుర్తింపు, నివాసం, బోధనా అనుభవం, డూప్లికేట్ నమోదు అంశాల్లో పరిశీలిస్తారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో నివాసాన్ని ధ్రువీకరిస్తారు. విద్యాశాఖ సహకారంతో అర్హత కలిగిన విద్యాసంస్థల నుంచి దరఖాస్తుల సేకరణ చేపడతారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబరు 20లోగా ముసాయిదా జాబితాను సిద్ధం చేసి, నవంబరు 25న ప్రచురిస్తారు. అదేరోజు నుంచి డిసెంబరు 10 వరకు దావాలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించి డిసెంబరు 25లోగా అనుబంధ జాబితాను రూపొందిస్తారు. తుది ఓటర్ల జాబితాను డిసెంబరు 30న ప్రచురించనున్నారు. సెప్టెంబరు 28న జారీ చేసిన బహిరంగ నోటీసును అక్టోబరు 15, 25 తేదీల్లో రెండు దినపత్రికల్లో పునఃప్రచురించాలని అధికారులు సూచించారు.








కామెంట్‌లు (0)