శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతల్లులకు తోడుగా చిన్నారులు

2 గంటల క్రితం

వైద్యారోగ్యశాఖ కాంట్రాక్టు సిబ్బంది ఆందోళనలో
తల్లులకు తోడుగా చిన్నారులు 
- ప్రభుత్వాస్పత్రి ముందు కొనసాగిన నిరసన
- నేడు నిర్ణయం వెలువడే అవకాశం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 11:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ప్రభుత్వాస్పత్రి ముందు కొనసాగిన వైద్యారోగ్యశాఖ కాంట్రాక్టు సిబ్బంది నిరసన

  • నేడు నిర్ణయం వెలువడే అవకాశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ వైద్యారోగ్యశాఖ కాంట్రాక్టు సిబ్బంది నిర్వహిస్తున్న ఆందోళనకు పిల్లలు తోడయ్యారు. తమ తల్లులు చేస్తున్న కష్టానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు చేస్తున్న నినాదాలు అందరినీ ఆలోచింపజేశాయి. వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న సుమారు 14,632 మంది కాంట్రాక్టు సిబ్బంది నాలుగు రోజులుగా ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇప్పటికి నాలుగుసార్లు చర్చలకు పిలిచి ఏమీ పరిష్కరించలేదని, కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన చర్చల్లోనూ ఏమీ తేల్చలేదని, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారని సంఘం నాయకులు ప్రకటించారు. శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రి ముందు వందలాది మంది పారామెడికల్ సిబ్బంది నిరసన కొనసాగించారు. వారి పిల్లలను కూడా వెంటబెట్టుకొచ్చారు. ‘మా అమ్మలకు న్యాయం చేయాలి.. ప్రభుత్వం స్పందించాలి’ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. పర్మినెంటు సిబ్బందితో సమానంగా పనులు చేస్తున్నా వారికొచ్చే వేతనంలో సగం కూడా ఉండటం లేదని ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు. అయితే చిన్నారుల నిరసన ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరినీ కదిలించింది. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, చేసిన పనికి సమాన వేతనం ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నామని కాంట్రాక్టు సిబ్బంది తెలిపారు. కోవిడ్‌ ‌సమయంలో తమను పొగిడిన అధికారులు ఇప్పుడు తమవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని, తాము మనుషులమేనని విషయాన్ని గ్రహించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్న తమను చర్చల పేరుతో పిలిచి సాయంత్రం వరకూ మాట్లాడి ఏమీ తేల్చడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. విధుల్లోకి రానివారికి నోటీసులిస్తోంది. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్