- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగ సంఘాల నేతలపై మంత్రులు అసత్య ప్రచారాలు చేయడం తగదని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పదేపదే కోరుతున్నప్పటికీ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేయడం సరైందికాదన్నారు. రాజకీయాలు చేసేది ఉద్యోగ సంఘాలు నాయకులు కాదు. కూటమి పాలకులు ఎన్నికల ముందు ఒకమాట, ఎన్నికల తర్వాత ఒకమాట మాట్లాడడం గర్హనీయమన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు పిఆర్‌సి ఇస్తామని, రూ.40 వేల కోట్ల పెండింగ్ డిఎ బకాయిలు చెల్లిస్తామని, సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ స్కీం అమలు చేస్తామన్న హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్ర రెవిన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ ఉద్యోగ సంఘాల నాయకులపై నిందలువేస్తూ అవాకులు, చవాకులు పేలడం దుర్మార్గం. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను వేతనాలు పెంచి రెగ్యులర్ చేస్తామని, తక్కువ జీతాలు తీసుకుంటున్న స్కీం కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా ప్రవర్తించడం విచారకరమని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)