బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​స్థానిక ఎన్నికలపై తప్పుడు ప్రచారం

1 గంట క్రితం

fake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సైబర్‌ క్రైమ్‌కు ఎపిఎస్‌ఇసి ఫిర్యాదు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో విడత సాధారణ గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై సోషల్‌ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎపిఎస్‌ఇసి) సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషన్‌ లెటర్‌హెడ్‌, అధికారిక లోగోలు, సంతకాన్ని ట్యాంపరింగ్‌ చేసి నకిలీ ఎన్నికల షెడ్యూల్‌ను వాట్సప్‌, సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటన ఈ నెల 21న జరిగిందని, దీనిపై ఈ నెల 24న కమిషన్‌, ఫేక్‌ న్యూస్‌గా స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. తాజాగా ఈ నెల 28న కమిషనర్‌ మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారని, ఓటర్ల జాబితా, రిజర్వేషన్లకు సంబంధించిన కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారని, ఎన్నికలకు అంతర్గత ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని మరో తప్పుడు సమాచారాన్ని వాట్సప్‌ గ్రూపుల్లో ప్రచారం చేశారని తెలిపారు. ఇది కమిషన్‌ జారీ చేసినది కాదని స్పష్టం చేశారు.

వరుసగా ఇలాంటి కల్పిత వార్తలు ప్రచారం కావడంతో ప్రజలు, మీడియా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారుల్లో గందరగోళం నెలకొంటోందని తెలిపారు. ఈ వ్యవహారంపై కమిషన్‌కు వందలాది ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని, దీనివల్ల ఎన్నికల సన్నాహక పనులకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ నెల 21, 28 తేదీల్లో జరిగిన రెండు ఘటనలపై లోతైన దర్యాప్తు చేసి, నకిలీ పత్రాలు రూపొందించి ప్రచారం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీస్టేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్