గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‌రెండు లారీల ఢీ.. ముగ్గురు డ్రైవర్ల సజీవ దహనం

01 జులై, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 10:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) : గుంటూరు-చిలకలూరిపేట 16 జాతీయ రహదారిపై ప్రత్తిపాడు మండల పరిధిలోని బోయపాలెం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. చిలకలూరిపేట వైపు నుండి గుంటూరు వస్తున్న ఒక లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, ఎదురుగా వస్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. రెండు లారీలకు మంటలు వ్యాపించి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాద స్థలం అంతా బీభత్సంగా మారింది. రెండు లారీల్లోని ముగ్గురు డ్రైవర్లు మృతి చెందినట్టు జిల్లా ఎస్‌‌పి వకుల్‌ ‌జిందాల్‌ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... నంద్యాల జిల్లా రామాపురం నుంచి మచిలీపట్నానికి నాపరాయి లోడ్‌‌తో వెళ్తున్న లారీ బోయపాలెం వద్ద రోడ్డు మధ్యలో ఆగి ఉన్న లారీని తప్పించబోయి డివైఢర్‌‌ను ఢీకొట్టి పక్కమార్గంలో వెళ్లాడు. అదే సమయంలో భద్రాచలం నుంచి బెంగుళూరుకు పేపరు లోడ్‌‌తో వెళ్తున్న లారీ మచిలీపట్నం వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి రెండు లారీలకు మంటలు వ్యాపించాయి. దీంతో నాపరాయి లారీలో ఉన్న డ్రైవర్ మేకల రవి కుమార్(35), అసిస్టెంట్‌ డ్రైవర్ రమేష్ (33) పేపర్ లోడ్ తో ‌వెళ్తున డ్రైవర్ కర్ణాటకకు చెందిన ధర్మపతి (26) సజీవ దహనం అయ్యారు. పేపర్ లోడ్ మొత్తం రెండు లారీల క్యాబిన్ పై పడటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్నికీలల్లో చిక్కుకున్న డైవర్ల అర్తనాదాలు మిన్నంటాయి. వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జాతీయ రహదారిపై రెండు లారీలు తగలబడిపోవడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా మళ్లించారు. అనంతరం జిల్లా ఎస్‌‌పి వకుల్ జిందాల్ ఘటన స్థలానికి చేరుకుని అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్