- నిర్ణయించిన ధరలకు రేపటి నుంచే కొనుగోళ్లు జరగాలి
- నిబంధనలు పాటించని కంపెనీలపై కఠిన చర్యలు
- ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణం
- ఆఫ్‌స్టైల్, లో గ్రేడ్ పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం
- వచ్చే సీజన్‌లో 80 మిలియన్ కేజీలకు మించి సాగుకు అనుమతి లేదు
- పొగాకు రైతుల కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
గుంటూరు : ఎఫ్‌సీవీ పొగాకు రైతులను ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి : కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లు, ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఈడీ, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. రైతుల సమస్యలు, కంపెనీల కొనుగోలు తీరు, ధరల అమలుపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎఫ్‌సీవీ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, గత సీజన్ చివరిలో మంచి ధరలు రావడంతో రైతులు ఆశతో సాగును పెంచారని, ఫలితంగా సుమారు 240 మిలియన్ కేజీల వరకు పొగాకు ఉత్పత్తి జరిగిందన్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, సిగరెట్లకు సంబంధించిన పరిణామాలు తదితర కారణాలతో ధరలు తగ్గాయని పేర్కొన్నారు. పొగాకు బోర్డు ఏర్పడిన తర్వాత రైతుల సమస్యలపై ఈ స్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి మరొకరు లేరని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆరుసార్లు గంటల తరబడి సమావేశాలు నిర్వహించి, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎఫ్‌సీవీ పొగాకు రైతులను ఈ సంక్షోభం నుంచి బయటపడేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కేంద్ర వాణిజ్య శాఖతో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోను పలుమార్లు చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు.
రైతులకు అదనపు ఆర్థిక సహాయం అందించే అంశంపై తొలుత కేంద్రంతో చర్చలు జరిపామని, అయితే ఇతర పొగాకు పండించే రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉందన్న కారణంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదన్నారు. దీంతో అధికారులు, రైతులు, పొగాకు బోర్డు ప్రతినిధులతో మరోసారి చర్చించి ఈ ఏడాది రైతులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని వివరించారు. పొగాకును నాలుగు గ్రేడ్లుగా విభజించి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయవద్దని కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. బ్రైట్ గ్రేడ్‌కు కిలో రూ.230కు తగ్గకుండా, మీడియం గ్రేడ్‌కు రూ.190కు తగ్గకుండా, ఆఫ్‌స్టైల్‌కు రూ.130కు తగ్గకుండా, లో గ్రేడ్‌కు రూ.110కు తగ్గకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి ఈ ధరలపై నిర్ణయం తీసుకున్నారని, అనంతరం కేంద్ర సహాయ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొగాకు బోర్డు అధికారులు, ట్రేడర్లతో మాట్లాడి నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారని తెలిపారు.
అయితే కొన్ని కంపెనీలు క్షేత్రస్థాయిలో నిర్ణయించిన ధరలను పాటించడం లేదన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అందుకే ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించి కంపెనీలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. “రేపటి నుంచి నాలుగు గ్రేడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే ప్లాట్‌ఫారమ్‌లపై కొనుగోళ్లు జరగాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తప్పవు” అని మంత్రి హెచ్చరించారు. కంపెనీల ప్రతినిధులు తమ యాజమాన్యాలతో మాట్లాడి రేపటి నుంచి నిర్ణయించిన ధరలకు కట్టుబడి కొనుగోళ్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పొగాకు బోర్డు రైతులు చెల్లించిన నిధులతోనే నడుస్తున్న నేపథ్యంలో రైతులకు తిరిగి అండగా నిలవాల్సిన బాధ్యత బోర్డుపై ఉందని కేంద్రానికి స్పష్టం చేశామని మంత్రి తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించి ప్రతి రైతుకు రూ.50 వేల చొప్పున రెండు సంవత్సరాలపాటు వడ్డీలేని రుణం అందించేందుకు అంగీకరించారని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ, పొగాకు బోర్డు సమన్వయంతో తక్షణమే కార్యాచరణ చేపట్టి బోర్డు అనుమతితో పొగాకు సాగు చేసిన రైతులతో పాటు అనుమతి లేకుండా సాగు చేసిన రైతులు, కౌలు రైతులు సహా అర్హులైన ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల చొప్పున రెండు సంవత్సరాల వడ్డీలేని రుణం అందించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.
దీనితోపాటు ఆఫ్‌స్టైల్, లో గ్రేడ్ పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అండగా నిలవాలని నిర్ణయించిందన్నారు. 94 మిలియన్ కేజీల ఆఫ్‌స్టైల్, లో గ్రేడ్ పొగాకుకు క్వింటాల్‌కు రూ.1,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలని నిర్ణయించిందని, అంటే కిలోకు రూ.10 మేర అదనపు సాయం అందుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే పొగాకు రైతులకు నిజమైన మేలు జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు విక్రయం జరిగిన అనంతరం రైతుల వివరాలను గుర్తించి, సంబంధిత రైతుకు రావాల్సిన మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ విధానంలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వచ్చే సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ 80 మిలియన్ కేజీలకు మించి ఒక్క కేజీ పొగాకు కూడా అదనంగా సాగు కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విత్తనాల సరఫరా దశ నుంచే నియంత్రణ తీసుకొచ్చి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సాగును పరిమితం చేయడం ద్వారా రైతులకు స్థిరమైన ధర లభించేలా ముందుకెళ్తామని చెప్పారు.
“రైతుకు నష్టం వస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మాది కాదు. మార్కెట్‌లో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా రైతుకు సాధ్యమైనంత మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఎఫ్‌సీవీ పొగాకు రైతులను ఈ ఏడాది సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు సమన్వయంతో అవసరమైన ప్రతి చర్య తీసుకుంటాం” అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)