చర్యలను ఖండిస్తూ సిపిఎం నాయకుల ఆందోళన.. పలువురు అరెస్టు
ప్రజాశక్తి-అనకాపల్లి: రాంబిల్లి మండలంలో లారస్ ఫార్మా కంపెనీ కోసం నిర్వాసిత రైతుల భూములకు కంచె వేసేందుకు భారీగా పోలీసులను మోహరించడంపై సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్. శంకరరావు, మండల కార్యదర్శి జి. దేముడు నాయుడు, మండల కమిటీ సభ్యులు ధోని కాశి, ఎర్రిపల్లి రాములను పోలీసులు అరెస్టు చేసి రాంబిల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతులకు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అమలు చేయకుండానే భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేయడం అన్యాయమని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు ఖండించారు. భూ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పోలీసు బలగాలతో కంచె వేసేందుకు ప్రయత్నించడం దౌర్జన్యపూరిత చర్య అని విమర్శించారు. అప్పన్నపాలెం, గోరపూడి, జెడ్ చింతవ గ్రామాలకు చెందిన ఎస్ఈజెడ్ నిర్వాసిత రైతుల నుంచి సుమారు 650 ఎకరాల భూములను లారస్ ఫార్మా కోసం సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా భూముల స్వాధీనానికి ప్రయత్నించడం సరికాదన్నారు.
రైతుల భూములకు కంచె వేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని, అరెస్టు చేసిన సీపీఎం నాయకులను విడుదల చేయాలని, న్యాయమైన నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అమలు చేసిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)