మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన టీచర్లను విధుల్లోకి తీసుకునేంతవరకు పోరాటం

17 గంటల క్రితం

ks lakshamanrao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 09:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మాజీ ఎమ్‌ఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గిరిజన గురుకుల టీచర్లను విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్ఎల్‌‌సి కెఎస్‌.లక్ష్మణరావు స్పష్టం చేశారు. సోమవారం యుటిఎఫ్‌ ‌భవన్‌లో గిరిజన సంక్షేమ గురుకుల ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌టీచర్స్‌ అండ్‌ ‌లెక్చరర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ ‌సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ15 ఏళ్లుగా గురుకుల విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు విద్యను అందిస్తోన్న టీచర్లను తొలగించడం దుర్మార్గమన్నారు. 668 మందిని విధుల్లో కి తీసుకునేంత వరకు అందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాటాలు చేస్తామన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు వెంకట్ సుబ్బారావు, ఐఎఫ్‌‌టియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.పోలారి, మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వమయితే వీరిని వెంటనే విధుల్లో తీసుకోవాలన్నారు. పది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి ఏమి పట్టదా?అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ వల్ల నష్టపోయిన అందరినీ విధుల్లోకి తీసుకోవాలన్నారు. టీచర్ల జీవితాలతో చెలగాటమాడద్దని హితవు పలికారు.అఖిల భారత గిరిజన ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినారి ప్రభాకర్, ఏకలవ్య రైట్ వెల్ఫేర్ నాయకులు విజయ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఎఐబిఎస్‌ఎస్‌ అధ్యక్షులు బాలాజీ నాయక్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అశోక్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ కోఆర్డినేటర్ భదియా నాయక్ మాట్లాడుతూ ఐక్యంగా పోరాటాలు చేసి విజయం సాధించాలన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. చదువు చెప్పాల్సిన టీచర్లు పోరాటం చేస్తున్నారంటే దీనికి ప్రభుత్వమే కారణమన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మీ ఉద్యోగాలు తొలగించనని హామీ ఇచ్చారని, ఆ హామీ మర్చిపోయారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమేష్, విజయ్ నాయక్, మహమ్మద్, తార, దిల్షాద్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్