‘మనిషి ఎంతకాలం బతికాడన్నది కాదు. ఎలాంటి విలువల కోసం బతికాడన్నదే చరిత్ర గుర్తుంచుకుంటుంది’ అనే మాట కామ్రేడ్ జోయ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. 2026 జూన్ 29న ఆమె భౌతికంగా మనల్ని విడిచి వెళ్లినా, ఆమె జీవితం, పోరాటం, నిబద్ధత, కమ్యూనిస్టు ఆదర్శాల పట్ల ఆమెకు ఉన్న అచంచల విశ్వాసం ప్రజా ఉద్యమాల చరిత్రలో నిలిచిపోతాయి.
నేటి రోజుల్లో రాజకీయాల్లో పదవులు, అధికారం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రోజుకో పార్టీ మారడం సాధారణ విషయంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బాల్యం నుంచే ఎర్రజెండాను తన జీవిత ధ్యేయంగా ఎంచుకొని, చివరి శ్వాస వరకు ఆ జెండాను వదలకుండా జీవించి, చివరికి ఎర్రజెండా కప్పుకొని అంతిమయాత్ర సాగించిన నాయకురాలు జోయ. ఆమె కుటుంబం 1946–51 మధ్య చల్లపల్లి జమీందారీ వ్యతిరేక రైతాంగ పోరాటంలో పాల్గొని జైలు శిక్షలు, నిర్బంధాలు అనుభవించింది. తన పుట్టిన ఊరు చిన్న కళ్లేపల్లి గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల్లంక గ్రామంలో వీరనారి వియమ్మ భూమి కోసం జరుగుతున్న ఉద్యమాలతో ఆమె కుటుంబం పోరుబాట పట్టింది. ఆ పోరాటంలో వియమ్మతో పాటు మరో ముగ్గురు పోలీసుల కాల్పుల్లో అమరులయ్యారు. చిన్నతనంలో త్యాగం, నిర్బంధం, పోరాటం, ప్రజా సమస్యల పట్ల అవగాహన వంటి విలువలను చూసి పెరిగిన జోయ, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చివరి వరకు పార్టీ జెండాను వదలలేదు.
జర్మన్ ఫాసిస్టు దురాక్రమణకు ఎదురు నిలిచి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 18 సంవత్సరాల సోవియట్ రష్యా వీరనారి జోయా (కొస్మోడెమ్యాన్స్కాయా) పేరు ఆమెకు పెట్టారు. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆమె జీవితమంతా కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమయ్యారు. విద్యార్థి ఉద్యమంలో ప్రారంభమైన జోయ రాజకీయ ప్రస్థానం ఐదు దశాబ్దాలకు పైగా సాగింది. మెట్టినిల్లు, పుట్టినిల్లు భూస్వామ్య కుటుంబం అయినప్పటికీ, భూస్వామ్య ప్రయోజనాలను కాక శ్రమజీవుల ప్రయోజనాలను ఎంచుకున్నారు. వర్గ చైతన్యాన్ని జీవితాంతం కాపాడుకున్నారు. ఆమె భర్త రామనరసింహం రాజకీయాలు భిన్నమైనప్పటికీ, జోయ మాత్రం తన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఏనాడూ మార్చుకోలేదు. పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ఆమె విశ్వాసం సడలలేదు. కృష్ణా జిల్లా నందిగామ డివిజన్ పార్టీ కార్యదర్శిగా రాష్ట్రంలో ఎన్నికైన మొదటి మహిళ జోయ. పార్టీ నిర్మాణంలో విశేష కృషి చేశారు. పూర్తికాలం కార్యకర్తల ఎంపిక, వారికి శిక్షణ, వారి కుటుంబాల బాగోగులు, వారి పిల్లల చదువులు, వారి ఆరోగ్య సమస్యల వరకు ప్రతి విషయాన్నీ ఆమె తన కుటుంబ సభ్యుల సమస్యలుగానే భావించేవారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే కుటుంబ బాధ్యతలను నిర్వహించేవారు.
1978 నుంచి ఆమెతో నాకు ఉద్యమ పరిచయం. 1985లో చందర్లపాడులో మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటులో జోయ కీలకపాత్ర పోషించి, ఆ సంఘానికి డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. మహిళల ఆర్థిక సాధికారితకు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా విజయ పాల ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో జిల్లాలో 50కి పైగా మహిళా పాల సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేశారు. మద్యపాన నిషేధ ఉద్యమంలో నందిగామ డివిజన్‌లో కళాకారులతో ప్రజాచైతన్య యాత్ర నిర్వహించి మహిళలను ఉద్యమాల్లో భాగస్వాములను చేశారు. హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్, సుబాబుల్ రైతాంగ పోరాటం, పంటకు గిట్టుబాటు ధర, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ కార్మికుల కూలి రేట్ల పోరాటాలు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు నిర్వహించారు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలను పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా పరిష్కరించేందుకు ప్రయత్నించేవారు. ఆమె ఇల్లు న్యాయ సలహా కేంద్రంగా ఉండేది. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన జోయ, మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడాలని భావించడం ఆమె మానవీయ విలువలకు నిదర్శనం. ఆమె నేత్రాలను, దేహాన్ని వైద్య విద్య కోసం దానం చేయడం ద్వారా చనిపోయిన తర్వాత కూడా మనిషి సమాజానికి ఉపయోగపడవచ్చని సందేశాన్ని ఇచ్చారు. జోయ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
– కె. స్వరూపరాణి







కామెంట్‌లు (0)