మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజల కోసం పోరాటమే దాసరికి ఇచ్చే నివాళి

1 గంట క్రితం

1786364739802.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 09:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నాగభూషణరావు విగ్రహావిష్కరణలో వక్తలు

ప్రజాశక్తి - నూజివీడు టౌన్ : త్యాగాలకు సిద్ధపడి ప్రజల కోసం పోరాడటమే కమ్యూనిస్టులుగా ఎన్ఆర్.దాసరి నాగభూషణరావుకు ఇచ్చే ఘన నివాళి అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భూపోరాట యోధుడు, రాజ్యసభ మాజీ సభ్యులు, సిపిఐ జాతీయ నాయకులు దాసరి నాగభూషణరావు శత జయంతి సందర్భంగా నూజివీడు అమరభవన్‌‌లో దాసరి కాంస్య విగ్రహాన్ని సిపిఐ సీనియర్ నాయకులు చలసాని జగన్నాథరావు, సిపిఐ తెలంగాణ, ఎపి రాష్ట్ర కార్యదర్శలు కూనంనేని సాంబశివరావు, గుజ్జుల ఈశ్వరయ్య ఆవిష్కరించారు. అనంతరం కొమ్మన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దాసరి పోరాట చరిత్ర నేటి తరానికి స్ఫూర్తి ప్రేరణ అని అన్నారు. 300 కోట్ల మంది ప్రజలు కమ్యూనిజం పాలిత దేశాల్లో ఉన్నారని, భారతదేశంలోని కోట్ల మంది ఎర్రజెండాను పట్టుకున్నారని పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ దాసరి ఆశయాల కోసం పనిచేస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మించడమే కమ్యూనిస్టుల కర్తవ్యమన్నారు. అధ్యయనం లేకుండా పోరాటం లేదని నమ్మిన వ్యక్తి దాసరి అని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ బడుగు జీవుల ఉన్నతి కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి దాసరి నాగభూషణ రావు అన్నారు. రిటైర్ట్‌ ఐపిఎస్ అధికారి ఎబి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్నీ వదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజా ఉద్యమాల్లో మమేకమైన వ్యక్తి దాసరి అని కొనియాడారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ మాట్లాడుతూ దాసరి చూపిన పోరాటస్ఫూర్తితో నేటితరం ప్రజా ఉద్యమాలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు వై.కేశవరావు, సిపిఐ (ఎంఎల్) నాయకులు హరినాథ్, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ఉపాధ్యక్షులు చలసాని రాఘవేంద్రరావు, సిపిఐ నాయకులు నార్ల వెంకటేశ్వరరావు, రవీంద్రనాథ్, చలసాని వెంకట రామారావు, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు మాట్లాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్