- బార్ కౌన్సిల్ నిర్ణయం
ప్రజాశక్తి-అమరావతి : మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర న్యాయవాద మండలి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా విడుదల చేసిన రూ.16.92 కోట్లను తొలి విడతగా 423 మంది మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు పంపిణీ చేయాలని శుక్రవారం జరిగిన తాత్కాలిక కమిటీ సమావేశంలో నిర్ణయించింది. బార్ కౌన్సిల్ తాత్కాలిక కమిటీ అధ్యక్షుడు నల్లారి ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఆలూరి రామిరెడ్డి, బి వెంకటరమణమూర్తి, ఉప్పలపాటి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసినందుకు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఇంకా పెండింగ్‌లో ఉన్న 727 మంది న్యాయవాదుల కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.29.08 కోట్లను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదే సమావేశంలో న్యాయవాదుల మరణ ప్రయోజనాలు, వైద్య ఖర్చుల కోసం వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి ఆమోదించింది. డెత్ బెనిఫిట్ పథకం కింద 94 మంది మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.8.04 కోట్లు మంజూరు చేయగా, వైద్య సహాయం కింద 178 మంది న్యాయవాదులకు రూ.1.55 కోట్లు మంజూరు చేసింది. మొత్తంగా డెత్ బెనిఫిట్, వైద్య సహాయం కలిపి రూ.9.50 కోట్ల ఆర్థిక సాయాన్ని ఆమోదించినట్లు కమిటీ ప్రకటించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం, బార్ కౌన్సిల్ సమన్వయంతో మరిన్ని చర్యలు చేపట్టాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.








కామెంట్‌లు (0)