ప్రజాశక్తి - పరవాడ (అనకాపల్లి జిల్లా):అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని శ్రీ సాయి చందన ఎపిఐ ప్రైవేట్ లిమిటెడ్ (ఫార్మా) పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రొడక్షన్ బ్లాక్-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిశ్రమ ఆవరణంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సుమారు పది ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫ్యాక్టరీల శాఖ ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం...... ఒమెప్రాజోల్ తయారీ ప్రక్రియలో తొలి దశలో మెథనాల్ డిస్టిలేషన్ జరుగుతున్న సమయంలో కండెన్సర్ వెంట్ ద్వారా వెలువడిన మెథనాల్ ఆవిరి స్టాటిక్ విద్యుత్ ప్రభావంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్న 34 మంది కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని పేర్కొన్నారు. ఘటనపై డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీలు ప్రాథమిక విచారణ చేపట్టి, పూర్తి దర్యాప్తు ముగిసే వరకూ సంబంధిత యూనిట్‌కు నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, భద్రతా లోపాలు, యాజమాన్యం నిర్లక్ష్యం తదితర అంశాలపై ఫ్యాక్టరీల శాఖ సమగ్ర విచారణ కొనసాగుతోంది. తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ప్రమాద స్థలాన్ని సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకర్రావు, ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం వారు అధికారులతో ప్రమాదంపై ఆరా తీసి మీడియాతో మాట్లాడారు. ఈ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. విధుల్లో ఉన్న ప్రతి కార్మికుడు సురక్షితంగా ఉన్నారా? లేదా? అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Print Edition ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)