- పులివెందులలో గాలిలోకి కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగం
- అధికార పార్టీకి పోలీసుల అండ
- కడప ఎంపి అవినాష్‌రెడ్డి హౌస్ అరెస్టు
- రాయచోటి, పుంగనూరులోనూ ఉద్రిక్తత
- రాయచోటి పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర ముఠా
ప్రజాశక్తి-యంత్రాంగం : కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో రెండో రోజూ టిడిపి శ్రేణులు అరాచకానికి పాల్పడ్దాయి. అధికార పార్టీకి పోలీసుల అండగా నిలవడంతో మరింత రెచ్చిపోయాయి. వైసిపి అభ్యర్థులను, వామపక్షాల అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా పలుచోట్ల అడ్డుకున్నాయి. పులివెందులలో రాళ్ల దాడులు, లాఠీఛార్జి, గాల్లోకి పోలీసుల కాల్పులు, బాష్పవాయు ప్రయోగం, లాఠీఛార్జి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
టిడిపి, పోలీసుల వైఖరితో పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత
నామినేషన్లు వేయడానికి వైసిపి అభ్యర్థులు పులివెందులలోని మున్సిపల్ నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. అప్పటికే నామినేషన్ వేయడానికి ఆ కేంద్రంలోకి వెళ్లిన టిడిపి వారు నామినేషన్ వేసిన తర్వాత కూడా బయట రాకుండా లోపలే తిష్టవేశారు. వారు వచ్చిన తర్వాతే మిమ్మల్ని లోనికి పంపుతామంటూ వైసిపి వారిని పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి వారు ఎంతకీ బయటకు రాకపోవడం, పోలీసులు లోనికి వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంతో వైసిపి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య వివాదం నెలకొంది. పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు తొలుత ఆరు రౌండ్లు, ఆ తర్వాత పది రౌడ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జి చేసి ఇరుగ్రూపులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఎస్పి విశ్వనాథ్, అడిషనల్ ఎస్పి ప్రకాష్... నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.
కడపలో వైసిపి, టిడిపి పరస్పరం రాళ్ల దాడి
కడప నగరంలోని గాంధీనగర్ స్కూల్లో నామినేషన్ కేంద్రం వద్ద వైసిపి, టిడిపి గ్రూపులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. కలెక్టరేట్ ప్రధాన రహదారి నడిరోడ్డుపై ఈ ఘటన చేసుకోవడంతో అక్కడి దుకాణాలుదారుణ తీవ్ర భయాందోళనకు గురై తమ షాపులను మూసివేశారు. కాలనీవాసులు, బాటసారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఉన్నతాధికారులు అదనపు పోలీసు బలగాలను ఈ ప్రాంతానికి తరలించారు. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరుపార్టీల శ్రేణులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రాయచోటిలో ఐదుగురి నుంచి రివాల్వర్, పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం
అన్నమయ్య జిల్లా రాయచోటిలో టిడిపి శ్రేణులు వైసిపి నేతల బౌన్సర్లనే అనుమానంతో ఐదుగురిని చితకబాదాయి. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా రివాల్వర్, పిస్టల్, బుల్లెట్లు, ఫ్లైట్ టికెట్లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని వీరు ఎక్కడి నుంచి వచ్చారనేదీ విచారణ చేస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు.
కడపలో వైసిపి నేతల ఇళ్ల ముట్టడి, గృహనిర్బంధం
కడప కార్పొరేషన్ వైసిపి తరఫున మేయర్ బరిలో నిలిచిన అభ్యర్థి దీప్తి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టి, ఎక్కడికీ కదలనీయకుండా ఆంక్షలు విధించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, వైసిపి కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి నివాసాల ముందు భారీగా బలగాలు మోహరించి వారిని గృహనిర్బంధంలో ఉంచాయి. మాజీ మేయర్ సురేష్ బాబును పోలీసులు బయటకు రానీయకుండా అదుపులోకి తీసుకున్నారు. కడప నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసిపి కార్పొరేటర్ అభ్యర్థులకు ముందస్తుగా పోలీసులు నోటీసులు, హెచ్చరికలు జారీ చేశారు. నాయకుల గృహనిర్బంధం విషయం తెలుసుకున్న వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తున వారి నివాసాల వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాయకుల ఇళ్ల పరిసరాల్లో గుమిగూడిన కార్యకర్తలను, నేతలను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరిమివేశారు. పుంగనూరులో వైసిపి 14వ డివిజన్ కార్పొటర్ నయాజ్ నామినేషన్ పత్రాలను లాక్కుని టిడిపి నాయకులు చింపేశారు. దీనిని నిరసిస్తూ రోడ్డుపై నయాజ్ ధర్నా చేశారు.
చట్టాన్ని వ్యతిరేకిస్తే చర్యలు తప్పవు
- కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, డిఐజి కోయ ప్రవీణ్
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ హెచ్చరించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అందరు సహకరించాలని కోరారు. పులివెందులలో పోలీసు కాల్పుల నేపథ్యంలో వారు అక్కడకి వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 163 బిఎన్ఎస్ సెక్షన్ అమలులో ఉందని, నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు ఇద్దరిని మాత్రమే వెంటబెట్టుకుని పెట్టుకుని రావాల్సి ఉంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో చిన్నచిన్న సంఘటన తప్ప నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. నామినేషన్లు ప్రశాంతంగా వేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని, ఎవరైనా నామినేషన్ వేయాల్సిన వారు ముందుగా సమాచారం ఇస్తే వారికి సమయం కేటాయిస్తామన్నారు.
పోలీసులపై దాడి చేయడం వల్లే లాఠీఛార్జి, గాలిలోకి కాల్పులు, బాష్పవాయువు ప్రయోగం : ఎస్పి
నామినేషన్ వేయడానికి దాదాపు 500 మందితో రావడంతో అభ్యంతరం చెప్పామని, నిబంధన ప్రకారం నామినేషన్ వేయడానికి రావాలని వైసిపి వారికి చెప్పామని కడప జిల్లా ఎస్పి నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. అయినా వారు వినకుండా పోలీసులపై రాళ్లతో దాడి చేయడంతో లాఠీఛార్జి, భాష్పవాయు ప్రయోగం, లాఠీఛార్జి చేశామని చెప్పారు.
తిరుపతిలో టిడిపి మేయర్ అభ్యర్థి జెబి శ్రీనివాస్ అనుచరుల అరాచకం
- వైసిపి మేయర్ అభ్యర్థి, ఇద్దరు కార్పొరేటర్ల నామినేషన్లు చించివేత
- ఈనాడు ఫొటోగ్రాఫర్ సహా మీడియా ప్రతినిధులపై దాడి
తిరుపతిలో టిడిపి మేయర్ అభ్యర్థి జెబి శ్రీనివాస్ అనుచరులు అరాచకం సృష్టించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను వేసేందుకు వైసిపి మేయర్ అభ్యర్థి వాసు యాదవ్... తన ప్రతిపాదకుడు, ఎంపి గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కలిసి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలు, ఆధార్ కార్డు చూపిస్తేనే లోనికి పంపిస్తామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అప్పటికే అక్కడ ఉన్న టిడిపి మేయర్ అభ్యర్థి జెబి శ్రీనివాస్ అనుచరులు గురుమూర్తి వద్ద ఉన్న నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేశారు. దీంతో, ఇదేమి అన్యాయమని గురుమూర్తితో పాటు వైసిపి శ్రేణులు ధర్నా చేశాయి. అంతకుముందు మూడో వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి ఉమ, 45వ వార్డు వైసిపి అభ్యర్థి ఇమామ్ సాహెబ్ లను నామినేషన్ల కూడా టిడిపి వారు లాక్కొని చించివేశారు. ప్రశ్నించిన ఇమామ్ సాహెబ్ పై దాడి చేశారు. మరోచోట మహిళ అని చూడకుండా అసభ్య పదజాలంతో టిడిపి వారు దూషించి ఆమె వస్త్రాలను చించే ప్రయత్నం చేశారు. దాడి, నామినేషన్ల చించివేత ఘటనలను చిత్రీకరిస్తున్న మీడియా వారిపై టిడిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈనాడు ఫొటోగ్రాఫర్ గంగాధర్ కెమెరాను లాక్కున్నారు. ఆయన తీసిన ఫొటోలను టిడిపి కార్యకర్తలు డిలీట్ చేశారు. చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేశారు. పంపేస్తామంటూ బెదిరించారు. మీడియా మిత్రులు అక్కడకు చేరుకుని ఫొటోలు తీసే ప్రయత్నం చేయగా అక్రిడేషన్లు, ఫోన్లు లాక్కుని దౌర్జన్యం చేశారు. దీనిపై వైసిపి ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపి మద్దిల గురుమూర్తి, అభ్యర్థి వాసు యాదవ్ ఆధ్యర్యంలో ఎస్పి సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఎంపి డిమాండ్ చేశారు.
దర్శిలో ఉద్రిక్తత
వార్డు మెంబర్ల స్థానానికి నామినేషన్లు వేయడానికి వైసిపి అభ్యర్థులు ఎనిమిది మంది ప్రకాశం జిల్లా దర్శిలో నామినేషన్లు వేయడానికి వచ్చారు. వారిలో ముగ్గురి నామినేషన్లను టిడిపి వారు లాక్కొని చింపివేశారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. ఈ చర్యను నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలసి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆందోళనకు దిగారు.
గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి
పల్నాడు జిల్లా మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు. గురజాల, దాచేపల్లి ఛైర్మన్ అభ్యర్థులతో పాటు వైసిపి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. తనను సైతం పోలీసులు శుక్రవారం రాత్రి నుండి హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు.
మిథున్‌రెడ్డి సహా 70 మందిపై కేసులు నమోదు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీసు స్టేషన్లో వైసిపి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవారం నామినేషన్ల సందర్భంగా జరిగిన మూడు ఘటనలకు సంబంధించి ఎంపి మిథున్‌రెడ్డి సహా 70 మందిపై కేసులు పెట్టారు. విధి నిర్వహణకు ఆటంకం కలిగించారంటూ డిఎస్పి, ప్రసాద్, ఇద్దరు టిడిపి నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వామపక్షాలపైనా దాడి
కడప జిల్లా బద్వేలులో సిపిఎం అభ్యర్థి మోక్షమ్మ వామపక్ష పార్టీల నాయకులతో కలసి నామినేషన్ వేయడానికి వెళ్లారు. కొంతమంది దుండగులు నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేసి వామపక్ష నాయకులను తరిమివేశారు. గుత్తిలో సిపిఎం అభ్యర్థిని నామినేషన్‌ను వేయనీయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కడపలో సిపిఐ అభ్యర్థి బాదుల్లా నామినేషన్లు చించివేశారు.










కామెంట్లు (0)