- మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చిన్న వయస్సులోనే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక స్క్రీనింగ్‌కు శ్రీకారం చుట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదయ్ తెలిపారు. జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ఆర్‌బిఎస్‌కె 2.0 గా అమలు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 62.65 లక్షల మంది చిన్నారులకు 38 రకాల సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వారికి పూర్తిగా ఉచిత చికిత్స అందించడమేనని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 20.05 లక్షల మంది చిన్నారులకు, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న 41.70 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, పోషకాహార సమస్యలు, వివిధ వ్యాధులు, ఎదుగుదలలో జాప్యం, వైకల్యాలను సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జన్యునపరమైన లోపాలు, పోషకాహార లోపాలు, వ్యాధులు, అభివృద్ధి, అలస్యాలు-వైకల్యాలు వంటి నాలుగు విభాగాల్లో 38 రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య బృందాలు నేరుగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను సందర్శించి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించిన పిల్లలను వైద్యాధికారులు మరోసారి పరీక్షించి అవసరాన్ని బట్టి జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ బోధనాసుపత్రులకు పంపిస్తారని తెలిపారు.








కామెంట్‌లు (0)