శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసుల బెదిరింపుతో మత్య్సకారుడి ఆత్మహత్యాయత్నం

1 గంట క్రితం

fisherman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 10:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- బాధితుడి భార్య దుర్గాభవానీ, జెడ్‌‌పిటిసి రత్నకుమారి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పోలీసులు చిత్రహింసలు పెట్టి, జీవనాధారమైన వ్యాన్‌ను సీజ్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరించడంతో బొలేరో వ్యాన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పేద మత్స్యకార కుటుంబానికి చెందిన తిరుమలశెట్టి కనకరాజు పోలీసు స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడని కృతివెన్ను జెడ్పీటీసీ మైలా రత్నకుమారి, కనకరాజు భార్య దుర్గాభవానీ తెలిపారు. ప్రస్తుతం కనకరాజు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. పేద కుటుంబం మీద అధికార వ్యవస్థ ఎలా దాష్టీకం చేస్తుందో చెప్పడానికి కనకరాజు ఘటన ఒక నిదర్శనమని అన్నారు. రక్షించాల్సిన పోలీసులే ప్రజలను భయపెట్టి, కొట్టి, అవమానించి, చివరకు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి తీసుకెళ్లడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. కనకరాజుపై దాష్టీకానికి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఒక నిరుపేద మత్స్యకార (అగ్నికుల క్షత్రియ) బిడ్డపై ఖాకీలు చూపించిన పైశాచికత్వం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిందని అన్నారు. విజయవాడ నుంచి వస్తున్న క్రమంలో దారిలో ఎస్‌ఐ ముందు హారన్ వేశాడన్న ఒకే ఒక్క కారణంతో బంటుమిల్లి ఎస్ఐ నాగరాజు అహం దెబ్బతిని నడిరోడ్డుపై నానా దుర్భాషలాడారని, క్షమించాలని వేడుకున్నా వినకుండా, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొట్టారని అన్నారు. తప్పు చేయకపోయినా అక్రమంగా 'డ్రంక్ అండ్ డ్రైవ్' కేసు నమోదు చేశారని అన్నారు. తన బండి ఇచ్చేయాలని ఎస్ఐ కాళ్ల మీద పడి కన్నీరుమున్నీరుగా ప్రాధేయపడ్డా వినకుండా నీచమైన భాషలో ఎస్ఐ దూషించాడని విమర్శించారు. పోలీసులు ఆయన్ని ఒక మనిషిలా కూడా చూడలేదని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్