కుటుంబ సభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం
ప్రజాశక్తి - అమలాపురం : డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు శుక్రవారం తమ స్వగృహాలకు చేరారు. పశ్చిమబెంగాల్‌లోని శంకర్ పూర్ జెట్టీ నుంచి ప్రత్యేక వాహనంలో అధికారులు వారిని ఓడలరేవుకు తీసుకొచ్చారు. ఈ నెల మూడున కొపనాతి రామకృష్ణవర్మ బోటులో రామకృష్ణతో పాటూ సంగాడి తాతారావు, పాలెపు శాంతారావు, కొల్లాటి శ్రీనివాస్, ఏసుదాసు, కర్రి రాముడు, కాటాడి సతీష్... ఓడలరేవు తీరం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అప్పటి నుంచి వారు గల్లంతయ్యారు. రెండు రోజుల క్రితం వారు పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నట్టు సమాచారం అందించారు. 25 రోజుల అనంతరం వారు తమ స్వగృహాలకు చేరుకున్నారు.
కుటుంబ సభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం...
మత్స్యకారులు ఇళ్లకు చేరడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. తొలుత మత్స్యకారులు కాకినాడకు చేరుకున్నారు. అక్కడ కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్ వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు ఓడలరేవుకు చేరుకున్నారు. అక్కడ అమలాపురం ఎంపి హరీష్ మాథూర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో పాటు వచ్చిన పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు మత్స్యకారులను ఎంపి హరీష్, కుటుంబ సభ్యులు సత్కరించారు.
ఇంజిన్‌లో సమస్యత తలెత్తడం వల్లే... కొపనాతి రామకృష్ణవర్మ, బోటు యజమాని, డ్రైవర్
వేటకు వెళ్లిన మరుసటి రోజే... అంటే ఆగస్టు 4న ఇంజన్ గేర్లలో సమస్యలు తలెత్తాయి. వాటిని బాగు చేసుకుని కాకినాడ తీరం వైపు వెళ్లాము. 5వ తేదీన పూర్తిగా ఇంజన్ నిలిచిపోయింది. గాలికి బోటు 250 నాటికల్ మైళ్ల దూరం వెళ్లిపోయింది. నిత్యావసరాలు పొదుపుగా వాడుకున్నా 15 రోజులకే అయ్యిపోయాయి. రెండు రోజులకోసారి జావలా తయారు చేసుకుని తాగాము. తెరచాప సాయంతో నీటి వాటంవైపు ప్రయాణం సాగించాము. ఒక వైపు తిమింగలాలు, మరో వైపు రాకాసి అలలకు బెంబేలెత్తాము. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణం సాగించాము. చివరకు పశ్చిమబెంగాల్ శంకర్పూర్ జెట్టి వద్ద మత్స్యకారులు వచ్చి తమను ఒడ్డుకు చేర్చారు. దుస్తులు, ఆహారం అందించి వైద్యం చేయించారు. వారి సాయంతోనే నేడు ఇక్కడికి వచ్చాము.








కామెంట్‌లు (0)