- స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దు
- అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు
- స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రపై సమీక్షలో సీఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛతను పెంచడం, వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని సర్కులర్ ఎకానమీ దిశగా అడుగులు వేయడం అనే అంశాలు నిరంతర ప్రక్రియగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా చేపట్టే వివిధ కార్యక్రమాలపై సిఎం శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాలుష్యాన్ని తగ్గించేందుకు.. స్వచ్ఛత పాటించేందుకు పెద్ద పీట వేసిందన్నారు. ప్రతీ నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని... ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచుతున్నామన్నారు. నెట్ జీరో, సర్కులర్ ఎకానమీ వంటి అంశాలపై దృష్టి సారించామని, దీనిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, స్కూళ్లు, అంగన్‌వాడీ వంటి కేంద్రాల్లో ఈ అంశాలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. కాలుష్యం తగ్గించడంతోపాటు.. ఖర్చులను కూడా తగ్గించుకునేలా అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ స్టవ్‌లు ఇస్తున్నామని, ఇప్పటికే మొదటి దశలో పట్టణ ప్రాంతాల్లో 11,400 ఇండక్షన్ స్టవ్ లను పంపిణీ చేశామని చెప్పారు.ఈ నెలాఖరులోగా మిగిలిన 44,346 అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండక్షన్ స్టవ్స్ వల్ల నెలకు రూ.247 మేర ఆదా అవుతోందని చెప్పారు. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న విశాఖ, గుంటూరు ప్లాంట్ల పనితీరుపై ఆరా తీశారు. కడప, కర్నూలు జిల్లాల్లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు శనివారం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు, కాకినాడ విజయవాడలలోని వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణ ప్రారంభ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఈ-ఆటోలు, కాంపాక్టర్స్, స్వీపింగ్ మిషన్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వచ్చే నెలాఖరులోగా ఇ-ఆటోలను, అక్టోబర్ నెలాఖరులోగా కాంపాక్టర్లను, స్వీపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. మిద్దె తోటల విధానాన్ని ప్రొత్సహించాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల వంటి వాటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. వ్యర్థాల నిల్వలు తొలగింపులో లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 33 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని.. మరో 148 ఎస్టీపీల పనులు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు, అక్టోబరు మాసాల్లో ఎస్టిపి ప్లాంట్లను అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. మేజిక్ డ్రెయిన్లను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం, కాకినాడ, విజయనగరం, అనంతపురం, పిడుగురాళ్ల, వినుకొండ, మచిలీపట్నంలలో పనులు ముమ్మరంగా జరిగాయని అధికారులు సీఎంకు తెలియచేశారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. పురపాలక శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.








కామెంట్‌లు (0)