ఆర్‌టిజిఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
యూరియా కొరత, తదితర అంశాలపైనా చర్చ
బిజినెస్ రూల్స్‌లో సంస్కరణలకు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేవాదాయశాఖలో ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మికతను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 21 ప్రముఖ ఆలయాలను యాత్రికులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారని, సరైన ప్రణాళికతో వీటిని గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆలయాలను ఆనుకుని ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా పెరగాలన్నారు. పర్యాటక కార్యకలాపాలు పెరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు, యూరియా లభ్యతపై రాష్ట్ర సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంలో ఆయన మంగళవారం సమీక్షించారు. దేవాదాయ, రహదారులు, భవనాలు, ఎపిఎస్‌ఆర్‌టిసి, రవాణా, అగ్నిమాపక, వ్యవసాయశాఖలు అందిస్తున్న వివిధ సేవలు, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న సంతృప్త స్థాయిపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పాలనలో టెక్నాలజీ అనుసంధానంతో అవసరం లేని బిజినెస్ రూల్స్‌ను సంస్కరించు కోవాల్సి ఉందని తెలిపారు. బిజినెస్ రూల్స్ తిరిగి రూపొందిచేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇకపై అన్ని ఫిర్యాదులకు సంబంధించి క్రౌడ్ సోర్సింగ్‌తో సమాచారం తీసుకోవాలన్నారు.
ప్రతి అర్జీదారుకూ తగిన సమాధానం ఇవ్వాలని సూచించారు. అగ్నిమాపక శాఖలో సేవల ప్రమాణాల్ని పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో యూరియా సరఫరాపై రైతు సంఘాలు, ఆర్ఎస్‌కె ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, యూరియా దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు.
ఉద్యోగులు తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు
క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అన్ని బస్టాండ్లలోనూ ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు.
బస్సులు కచ్చితమైన సమయానికి వచ్చే అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గత పాలనలో రాజకీయ కక్షతో కొందరి భూముల్ని 22ఏ కింద పెట్టి వివాదంలోకి నెట్టారన్నారు. ఇప్పటికీ 27 లక్షల మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించామని, ఇంకా 72 లక్షల మందికి జారీ చేయాల్సి ఉందని అన్నారు. శెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించడంతో రైతుల సమస్యలు తీరాయని, అంతేకాకుండా రూ.900 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి వచ్చిందన్నారు. పిజిఆర్ఎస్‌తో పాటు వివిధ రకాలుగా వచ్చే ప్రతి అర్జీ, ఫిర్యాదునూ మానవతా కోణంతో పరిష్కరించాలని సూచించారు. ఆర్‌టిజిఎస్ రూపొందించిన గవర్నెన్స్ దట్ నెవర్ స్లీప్స్ మాసపత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సమీక్షకు మంత్రి పార్థసారధి వర్చువల్‌గా, ఆర్‌టిజిఎస్ నుంచి సిఎస్ సాయి ప్రసాద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.








కామెంట్‌లు (0)