మహాత్మ జ్యోతిరావు పూలే ద్విశత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బీసీ సంఘర్షణ సమితి, తిరుపతి ఆధ్వర్యంలో జూలై 5న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సింధూర కల్చరల్ అసోసియేషన్, ఒంగోలు వారు 'మహాత్మ జ్యోతిరావు పూలే' సంగీత నృత్య నాటకాన్ని ప్రదర్శించారు. పాటిబండ్ల ఆనందరావు దర్శకత్వం వహించగా, బాలినేని నాగేశ్వరరావు సహ దర్శకత్వం వహించారు. సమాజ నిర్వాహకుడు ఉన్నం వెంకట శేషయ్య.
'మహాత్మ జ్యోతిరావు పూలే' అనే పేరుతో ప్రదర్శించినప్పటికీ, ఈ నాటకం జ్యోతిరావు–సావిత్రిబాయి పూలే దంపతుల ఉమ్మడి జీవన పోరాటానికి దృశ్యరూపం. ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలిచి, వ్యక్తిగత జీవితాన్ని సమాజ పరివర్తనకు అంకితం చేసిన ఆ మహనీయ దంపతుల జీవితంలోని కీలక ఘట్టాలను నాటక రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ సమగ్రంగా మలిచారు.
రెండు శతాబ్దాల క్రితం విదేశీ పాలనలో దేశ ప్రజల జీవితం దుర్భరంగా ఉన్నప్పటికీ, శూద్రులు, అతిశూద్రుల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. మనిషిగా బతికే హక్కు, గౌరవం, విద్య, మంచినీరు వంటి కనీస హక్కులు కూడా వారికి అందుబాటులో లేవు. నిరక్షరాస్యత, పేదరికం, వర్ణ వివక్ష, సామాజిక బహిష్కరణల మధ్య పశువులకంటే హీనమైన జీవితం గడపాల్సిన పరిస్థితులను నాటకం హృదయాన్ని తాకేలా ఆవిష్కరించింది. పలక పట్టి అక్షరం నేర్చుకునే హక్కు లేదు. ఊరి బావిని తాకకూడదు. మెడకు ముంత, వీపుకు తాటాకు కట్టుకుని, అడుగుజాడలు కూడా కనిపించకుండా నడవాల్సిన అవమానకర జీవితాన్ని నాటకం కళ్లకు కట్టినట్లు చూపించింది. అలాంటి అజ్ఞానాంధకారాన్ని చీల్చుకొచ్చిన అక్షరసూర్యుడు జ్యోతిరావు పూలే. ఆయనకు తోడుగా సావిత్రిబాయి స్త్రీ విద్యకు, సామాజిక సమానత్వానికి జీవితాంతం పోరాడిన మహోన్నత సంస్కర్తగా నిలిచారు.
మరాఠ్వాడ, పూణే ప్రాంతాల్లో పీష్వాల నిరంకుశ పాలనను ఎదుర్కొంటూ అణగారిన వర్గాలకు విద్య, ఆత్మగౌరవం, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని పూలే దంపతులు అలవాటు చేశారు. దాడులు, హత్యాయత్నాలు, సామాజిక బహిష్కరణలు ఎదురైనా వెనుదిరగలేదు. అందుకే జ్యోతిరావుకు 'మహాత్మ' అనే గౌరవం లభించింది. కులాంతర, మతాంతర, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, బలవంతంగా గర్భం దాల్చిన వితంతువులకు ఆశ్రయం కల్పించడం వంటి సంస్కరణలను కూడా నాటకం హృద్యంగా ఆవిష్కరించింది. ఒక జాతి గొప్పది, మరో జాతి నీచమైనదన్న భావన ఎంత అమానవీయమో జ్యోతిరావు ప్రశ్నల రూపంలో ప్రేక్షకుడి ముందుంచుతారు. అగ్రకులంలో పుట్టడమే గొప్పతనమైతే, శాస్త్ర పాండిత్యమే ప్రమాణమైతే, నేల పలకపై బీజాక్షరాలు దిద్దిన వాడికి శూద్రుడనే ముద్ర ఎందుకు? జందెం ధరించడమే సంస్కారానికి చిహ్నమైతే, ఆ జందెం పోగును వడికినవాడు, పంట పండించినవాడు మరింత గౌరవానికి అర్హుడు కాదా? అనే ప్రశ్నలు నాటకానికి తాత్విక లోతును చేకూరుస్తాయి. "జందెం ధరించిన వాడి కడుపులో ప్రేమ ఉండాలే గానీ, ద్వేషం ఉండకూడదు", "బుర్రలు ఖాళీగా ఉన్నా పరవాలేదు... కడుపులు ఖాళీగా ఉండకూడదు" వంటి సంభాషణలు నాటకానికి భావగాంభీర్యాన్ని చేకూర్చాయి. ఉపాధ్యాయురాలిగా అవమానాలను ఎదుర్కొంటున్న సావిత్రిబాయిని జ్యోతిరావు ఓదార్చినప్పుడు, "స్త్రీని అవమానించిన శాస్త్రం, ధర్మం, సంఘం సిగ్గుపడాలి గానీ నేను కాదు" అని ఆమె చెప్పే సమాధానం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.
జ్యోతిరావు తండ్రి గోవిందరావు తన బిడ్డల భవిష్యత్తు గురించే ఆవేదన చెందుతుంటే, పూలే దంపతులు మాత్రం సమాజంలోని అణగారిన పిల్లలందరినీ తమ బిడ్డలుగా భావించి వారి కోసం జీవితాన్నే అంకితం చేస్తారు. తనకు సంతానం కలగలేదనే కారణంతో రెండో వివాహం చేసుకోవాలని పెద్దలు సూచించినప్పుడు, "అది నాకు కాదు... సావిత్రికే చేయాలి" అని జ్యోతిరావు చెప్పే సంభాషణ స్త్రీ సమానత్వంపై ఆయన దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మోసపోయిన ఓ వితంతువు బిడ్డను దత్తత తీసుకోవడం, చివరికి తన ఆశయాలను కొనసాగించినంతకాలమే వారసత్వానికి అర్హుడని వీలునామాలో పేర్కొనడం ద్వారా వ్యక్తుల కంటే ఆశయాలే శాశ్వతమనే సందేశాన్ని నాటకం బలంగా ప్రతిపాదించింది. నాటకం చివరి వరకు ప్రేక్షకులను ఆలోచింపజేస్తూ సాగుతుంది. సమాజానికి ఎదురు నిలిచి కష్టాలు ఎందుకు కొనితెచ్చుకుంటున్నారని సావిత్రి తండ్రి ప్రశ్నించినప్పుడు, "పడవ ఒడ్డున పడి ఉండటానికి కాదు... కెరటాలను ఎదురించి ప్రయాణించడానికి" అని జ్యోతిరావు చెప్పే సమాధానం ఆయన జీవిత తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే "పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఉపాధ్యాయుడు కొడతాడు... సమాజం సమాధానం చెప్పలేనప్పుడు హత్యకు పూనుకుంటుంది" అనే సంభాషణ నాటకంలోని అత్యంత శక్తివంతమైన ఘట్టాల్లో ఒకటిగా నిలుస్తుంది.
దాదాపు నలభై మంది కళాకారులతో రూపొందిన ఈ సంగీత నృత్య రూపకం ప్రేక్షకులను కట్టిపడేయడమే కాకుండా, జ్యోతిరావు–సావిత్రిబాయి పూలే వెలిగించిన సామాజిక చైతన్య జ్యోతిని మరోసారి గుర్తు చేస్తుంది. రచనలోని బిగువు, దార్శనిక దృష్టి, సంభాషణల పదును, ప్రధాన పాత్రధారుల అభినయం ఈ ప్రదర్శనకు ప్రధాన బలాలుగా నిలిచాయి. సూత్రధారుడి అనుసంధానం నాటక ప్రవాహాన్ని ఎక్కడా దెబ్బతిననీయకుండా ముందుకు నడిపించింది. అయితే రంగాలంకరణ, వస్త్రధారణ, వేదికపై ఉపయోగించిన కొన్ని పరికరాల విషయంలో మరింత శ్రద్ధ అవసరమనిపించింది. నేపథ్యంలో వినిపించిన గానం శ్రావ్యతపైనా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ప్రదర్శన మరింత ప్రభావవంతంగా ఉండేది. రచనలోని బిగువు, దర్శకత్వంలోని స్పష్టత, ప్రధాన పాత్రధారులతో పాటు సహనటీనటుల సమిష్టి అభినయం ప్రేక్షకులను చివరి వరకు కథతో పాటు ప్రయాణించేలా చేస్తాయి. నాటకం ముగిసే సమయానికి ప్రేక్షకుడి మనసులో నిలిచేది కేవలం జ్యోతిరావు పూలే జీవితమే కాదు, ఆయన ప్రారంభించిన సామాజిక విప్లవం ఇంకా పూర్తి కాలేదనే ఆలోచన కూడా.
- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655







కామెంట్‌లు (0)