ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో ఎఐజి హాస్పిటల్‌కు శంకుస్థాపన

31 ఆగస్టు, 2026

hospital
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 01:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పదివేల పడకల సామర్థ్యంలో నిర్మాణం

- సంస్థ చైర్మన్‌ నాగేశ్వర్ రెడ్డితో కలిసి లోకేష్‌ భూమిపూజ

ప్రజాశక్తి -​మధురవాడ (విశాఖపట్నం) : విశాఖలో నిర్మించనున్న ఎఐజి హాస్పిటల్‌‌కు సంస్థ చైర్మన్‌ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో క‌లిసి రాష్ట్ర విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం భూమిపూజ చేశారు. జివిఎంసి ఎనిమిదివ వార్డు పరిధి ఎండాడ వద్ద రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో 1,000 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్‌ ‌మాట్లాడుతూ... విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్‌తో పాటు దేశంలోనే ప్రముఖ మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విశాఖలో తొమ్మిది ఎకరాలలో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఎఐజి ఏర్పాటు చేస్తోందని తెలిపారు. దశలవారీగా ఐదేళ్లలో రూ. రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు, వెయ్యి మంది వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తొలిదశలో 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి, రెండో దశలో 350 పడకల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తారని వివరించారు. ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో 50కి పైగా స్పెషాలిటీలతో రోజుకు ఐదు వేల మంది ఒపి సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఎఐజి చైర్మన్‌ ‌డి.నాగేశ్వర్‌‌రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రిగా కాకుండా, నైతిక విలువలతో కూడిన వైద్యం, పరిశోధన, శిక్షణను ఇక్కడ అందిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దేశం నలుమూలల నుంచి ప్రజలు చికిత్స కోసం విశాఖ వచ్చేలా దీనిని తీర్చిదిద్దుతామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మెరుగైన వైద్యం అందించి తన ప్రాణాలు కాపాడారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మతుకుమిల్లి శ్రీభరత్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.గణబాబు, ఎఐజి హాస్పిటల్స్ వైస్ చైర్మన్ పివిఎస్.రాజు డైరెక్టర్ జివి.రావు, సిఇఒ సామ్ రిజ్వీ, విశాఖ ఎఐజి డైరెక్టర్ కే.రాకేష్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్,విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభ్రత బాగ్చి, సిఒఒ కాప్రీ జలోట పాల్గొన్నారు.

​రోశయ్య విగ్రహావిష్కరణ

విశాఖపట్నంలోని సిరిపురం సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్‌ ‌ఆవిష్కరించారు. అనంతరం వాల్తేర్ క్లబ్ సమావేశ మందిరంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. రోశయ్య జీవిత విశేషాలతో కూడిన ఛాయచిత్ర ప్రదర్శనను తిలకించారు. రోశయ్య కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన మహోన్నత రాజకీయ వేత్త రోశయ్య అని కొనియాడారు. విజయవాడలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైజ్' అని నామకరణ చేసినట్టుగానే, రోశయ్య గౌరవార్ధం ఆయన విగ్రహానికి 'స్టాచ్యూ ఆఫ్ స్టేట్స్ మెన్' అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్