- మధురవాడలో వర్చువల్ రియాలిటీ ఎరీనా, 5 స్టార్ హోటల్‌తో పాటు గేటెడ్ హౌసింగ్ ప్రాజెక్టులు
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖపట్నాన్ని దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా తీర్చిదిద్దే దిశగా వీఎంఆర్‌డీఏ మధురవాడలో రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ విధానంలో రూ.90 కోట్లతో "వైజాగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఎరీనా–5 స్టార్ హోటల్" ప్రాజెక్టు, రూ.124 కోట్లతో గేటెడ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ అభివృద్ధి ప్రాజెక్టులను బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో గణనీయమైన వాటా విశాఖకు వస్తోందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత మధురవాడ, రుషికొండ, ఆనందపురం ప్రాంతాలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌ల తరహాలో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
మధురవాడలో ఏర్పాటు చేయనున్న వర్చువల్ రియాలిటీ ఎరీనాలో అత్యాధునిక వీఆర్, ఎఆర్ ఆధారిత వినోద సదుపాయాలు, 360 డిగ్రీల ఇమ్మర్సివ్ థియేటర్, గేమింగ్ జోన్‌లు, ఇంటరాక్టివ్ అనుభూతులు అందుబాటులోకి రానున్నాయి. దీనితో పాటు 175 గదులతో కూడిన 5 స్టార్ హోటల్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు విశాఖ పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తుందని ఆయన తెలిపారు.
అనంతరం వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన గృహ వసతి అందించేందుకు మధురవాడ, వేపగుంట ప్రాంతాల్లో గేటెడ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లను పిపిపి విధానంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు.
గుప్తా ఇన్‌ఫ్రావెంచర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రెండు ప్రాజెక్టుల అభివృద్ధిని చేపడుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే విశాఖలో పర్యాటకం, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు నగర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.








కామెంట్‌లు (0)