- ప్రభుత్వం సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలి
- డ్రగ్స్ నివారణకు గట్టి చర్యలు
- పిఎన్ఎం రాష్ట్ర మహాసభ తీర్మానాలు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి/కార్పొరేషన్ : భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని, ప్రభుత్వం సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర 11వ మహాసభ తీర్మానించింది. కర్నూలులోని సన్యాసిరావు, పెంచలయ్య నగర్లో జరుగుతున్న రాష్ట్ర మహాసభ ఆదివారం పలు తీర్మానాలను చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని ఎం.చంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. భావప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొంది. రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. భిన్నాభిప్రాయాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలనే తీర్మానాన్ని పెద్దిరాజు ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. యువత, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సేవలు, మత్తు విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది.
ఆదివాసీల సంస్కృతి, జీవన విధానం, సంప్రదాయ కళారూపాలను పరిరక్షించాలని కోరింది. అభివృద్ధి పేరుతో ఆదివాసుల నిర్వాసితీకరణను నిలువరించి, పునరావాసంతో పాటు వారి సాంస్కృతిక పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఐటిడిఎల ద్వారా ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రజా పోరాటాలకు బాసటగా ప్రజా కళలు
- సౌహార్థ్ర సందేశంలో ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ
ప్రజానాట్య మండలి మహాసభలో పలువురు సౌహార్థ్ర సందేశాలు ఇచ్చారు. ప్రజా పోరాటాలకు ప్రజా కళలు బాసటగా నిలిచినప్పుడే ప్రజా ఉద్యమాలు విజయవంతం అవుతాయని ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాలు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు ప్రజాకళాకారులను బలహీనపరిచేందుకు ఎన్నో కుతంత్రాలు చేస్తున్నారని వివరించారు. వీధి నాటకాన్ని పోరాట ఆయుధంగా మలుచుకొని ప్రజల్లో చైతన్యం నింపేందుకు భవిష్యత్తులో మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. లౌకికవాదం, మతసామరస్యం, ప్రజాస్వామ్య విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాకళాకారులమైన మన అందరిపై ఉందన్నారు.
ప్రజా ఉద్యమాలకు ఉత్ప్రేరిక శక్తిగా నిలవాలి : ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బలరాం
గొంతులేని ప్రజల గొంతుకగా ప్రజానాట్య మండలి పనిచేస్తోందని, భవిష్యత్తులో మరింత శక్తివంతంగా ప్రజా ఉద్యమాలకు అండగా నిలవాలని, ప్రజా ఉద్యమాలకు ఉత్ర్పేరిక శక్తిగా నిలవాలని ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బలరాం అన్నారు. సంఘటిత రంగ కార్మికులు, వృత్తిదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, సామాజికంగా దళితులు, గిరిజనులు వివక్షకు గురవుతున్నారని, మైనార్టీలు తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగిందని వివరించారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజానాట్యమండలి తన సాంస్కృతిక ఉద్యమాలను మరింత విస్తరించాలని సూచించారు.
సాంస్కృతిక ఉద్యమాల బలోపేతానికి పిఎన్ఎంతో కలిసి కృషి : వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు వెంకట్రావు
సాంస్కృతిక ఉద్యమానికి ప్రజానాట్య మండలి వారథిగా నిలుస్తూ ప్రజా ఉద్యమాల కోసం విశేషంగా పనిచేస్తోందని వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పూసపాటి వెంకట్రావు అన్నారు. తమ వృత్తి రంగంలో ఉన్న కళాకారులను కూడా ప్రోత్సహించి ప్రజానాట్య మండలి కార్యకలాపాలకు అనుసంధానం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రశ్నించే శక్తులుగా మారాలి : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి
సమాజంలో ప్రశ్నించే శక్తులుగా మారాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే ధోరణి పెంపొందితేనే పాలకులు స్పందిస్తారన్నారు.








కామెంట్‌లు (0)