ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి కొంతమంది అభ్యర్థుల ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు అందాయని, వాటిని జత చేస్తూ దర్యాప్తుపై తుది నివేదిక దాఖలు చేశామని సిట్ సోమవారం హైకోర్టుకు నివేదించింది. సిట్ సమర్పించిన తాజా నివేదికను కోరుతూ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి జిరాక్స్ కాపీలు అందజేయాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అప్పీళ్లపై తుది విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి రమేష్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.గ్రూప్-1 ప్రధాన పరీక్షలో అక్రమాలను నిర్ధారిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు ఎంపికకాని అభ్యర్థులు మరికొందరు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలను తేల్చేందుకు డిజి స్థాయి అధికారికి తగ్గని అధికారితో సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పీళ్ల విచారణ సందర్భంగా సిట్ దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక దాఖలు చేసినట్లు తెలిపింది. మొత్తం 736 మంది అభ్యర్థులకు సంబంధించిన జవాబు పత్రాలపై ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని, తొమ్మిది మంది అభ్యర్థుల జవాబు పత్రాల విషయంలో సెకెండ్ ఒపీనియన్ కోరగా ఇద్దరి నివేదికలు అందాయని, మరో ఏడుగురి నివేదికలు రావాల్సి ఉందని గతంలో పేర్కొంది. ఆ ఏడుగురికి సంబంధించి సెకెండ్ ఒపీనియన్ సమర్పించేందుకు మరో రెండు వారాల గడువు కోరింది. సోమవారం విచారణలో సిట్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదిస్తూ, ఏడుగురు అభ్యర్థుల విషయంలోనూ ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు అందాయని, వాటిని జత చేస్తూ దర్యాప్తునకు సంబంధించిన తుది నివేదిక దాఖలు చేశామన్నారు.
గ్రూప్-1 జవాబు పత్రాలపై హైకోర్టుకు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు
54 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)