- రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ సరుకులివ్వాలి
- కలెక్టరేట్ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన
ప్రజాశక్తి - యంత్రాంగం : పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు. చౌకధర దుకాణాల ద్వారా బియ్యం, పప్పులు, పంచదార, వంటనూనె, ఉల్లిపాయలు, ఇతర నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించాలని నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కూరగాయలు, ఉల్లిపాయలను తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను కలెక్టరేట్ అధికారులకు అందజేశారు.
విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట గ్యాస్ సిలిండర్, ఉల్లిపాయ, బియ్యం బస్తాను ప్రదర్శనగా పెట్టి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. నిత్యావసర సరుకుల ధరల పట్టికను ప్రదర్శించారు. ‘ఆదాయం నిల్లు.. ధరలు ఫుల్లు’, ‘ధరల పెరుగుదలను అదుపు చేయలేని టిడిపి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్’ అంటూ పెద్దపెట్టున నినదించారు. అనంతరం పిజిఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎన్.మాధవి, వై.సత్యవతి మాట్లాడారు. పాలకుల విధానాలతో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుల జీవనాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని 22వ వార్డులో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడారు. పేదలను ఆదుకునేందుకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం 14 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో అనంతపురం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. విజయనగరంలో జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, పార్వతీపురంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.శ్రీదేవి, బి.లక్ష్మి మాట్లాడారు. నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రతి కుటుంబంపై నెలకు అదనంగా రూ.నాలుగు వేలు నుంచి ఏడువేలు అదనపు భారం పడుతుందన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)