- వేలాదిమందితో షాహిద్ పార్కులో ధర్నా, ప్రదర్శన
- ‘భూమి, అడవులు మావే.. అదానీ, అంబానీలవి కావు’
- షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రాజ్యాంగ హక్కులు అమలు చేయాలని డిమాండ్
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : ఆదివాసీల హక్కులను హరించేందుకు అనుమతించబోమని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్‌ఎం) నాయకులు స్పష్టం చేశారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన ఐదో, ఆరో షెడ్యూళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎఎఆర్‌ఎం ఆధ్వర్యంలో సోమవారం నాడిక్కడ ఢిల్లీ గేట్ సమీపంలోని షహీదీ పార్క్‌లో వేలాది మంది ఆదివాసీలు భారీ ధర్నా, ప్రదర్శన నిర్వహించారు. ‘భూమి, అడవులు మావే.. అదానీ, అంబానీలవి కావు’ అంటూ నినదించారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల నుంచి ఆదివాసీ ప్రతినిధులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీల భూములు, సహజ వనరులపై వారి హక్కులను పరిరక్షించాలని, అడవులను కార్పొరేట్ సంస్థలకు, మైనింగ్ ప్రాజెక్టులకు కేటాయించడాన్ని నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను నిర్వాసితులను చేయవద్దని, వారికి ఉపాధి అవకాశాలు కల్పిం చాలని కోరారు. రిజర్వేషన్ల అమలులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ఎఎఆర్‌ఎం జాతీయ చైర్మన్ జితిన్ చౌదరి, జాతీయ కన్వీనర్, మాజీ ఎంపి ఫులీన్ బిహారీ బస్కే, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకరత్, మాజీ ఎంపి, జాతీయ మాజీ అధ్యక్షుడు మిడియం బాబూరావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఎఎఆర్ఎం జాతీయ నాయకులు అప్పలనర్స, తెలంగాణ ఉపా ధ్యక్షుడు రవికుమార్ తదితరులు ప్రసంగించారు.
గ్రామసభల హక్కులకు భంగం..
అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్ఎ), పీసా చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త అటవీ సంరక్షణ చట్టం-2023ను తీసుకొచ్చిందని విమర్శించారు. దీనివల్ల ఆదివాసీ గ్రామసభల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. మైనింగ్ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను భూముల నుంచి దూరం చేయడం సరికాదన్నారు. అడవులపై ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధికి కీలకమైన ఉపాధి హామీ పథకానికి బదులుగా కొత్త పథకాలను తీసుకురావడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ జనాభా ప్రాతిపదికన ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్ల అమలులో ఉన్న సమస్యలను పరిష్కరించి, అర్హులైన ఆదివాసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, పాఠశాలల మూసివేతను నివారించాలని కోరారు. విద్యా బడ్జెట్‌లో కోతలు విధించడం వల్ల ఆదివాసీ విద్యార్థులకు నష్టం జరుగుతోందని విమర్శించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలపై ఏకపక్ష సాంస్కృతిక భావజాలాన్ని రుద్దడాన్ని వ్యతిరేకిస్తామని తెలిపారు. తమ సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణకు పోరాటాలను కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. ప్రైవేటు రంగంతో సహా అన్ని రంగాల్లో ఆదివాసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఆదివాసీ విద్యకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని కోరారు. అటవీ హక్కులను బలహీనపరిచే ప్రభుత్వ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు.
బాక్సైట్ తవ్వకాలను అనుమతించొద్దు..
రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కుల అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఎఎఆర్‌ఎం ఆంధ్రప్రదేశ్ నాయకులు కిల్లో సురేంద్ర, రామారావు, తెలంగాణ కార్యదర్శి పూసం సచిన్ తదితరులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైడల్ పవర్ ప్రాజెక్టులను నిలిపివేయాలని, బాక్సైట్ తవ్వకాలను అనుమతించవద్దని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జిఒ నంబర్ 3ను పునరుద్ధరించి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీలకు రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. తెలంగాణలో సాగులో ఉన్న ఆదివాసీల భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భూములు, అస్తిత్వాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పీసా చట్టాన్ని అమలు చేయాలని, టైగర్ కారిడార్ల పేరుతో ఆదివాసీలను వారి నివాస ప్రాంతాల నుంచి తరలించే విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 49తో ప్రతిపాదించిన టైగర్ కారిడార్‌ను రద్దు చేయాలని కోరారు.








కామెంట్‌లు (0)