- మంత్రి నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు వచ్చే ఆరు నెలల్లో సంపూర్ణ న్యాయం జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అగ్రిగోల్డ్ సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొనగా, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ వర్చువల్‌గా హాజరయ్యారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి, డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల పత్రాలు, భూముల రికార్డులు ధ్వంసమయ్యాయని, సీఐడీ వద్ద ఉన్న హార్డ్ డిస్కులు మాయమయ్యాయని మంత్రి ఆరోపించారు. డిపాజిటర్లకు చెల్లించిన రూ.882 కోట్లలో అక్రమాలకు ప్రయత్నించారని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను రక్షించేందుకు జియో ట్యాగింగ్ చేపడతామని, మొత్తం 23,599 ఎకరాల భూములను గుర్తించినట్లు తెలిపారు. అలాగే ఏజెంట్ల వద్ద ఉన్న సుమారు రూ.2 వేల కోట్ల విలువైన బాండ్లను 30 రోజుల్లో స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో 11.57 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు రూ.3,944 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, కోర్టు ఆదేశాలతో భూములను త్వరితగతిన వేలం ప్రక్రియ పూర్తి చేసి, ఆ సొమ్మను డిపాజిటర్లకు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తుందన్నారు. కేసుల పురోగతి, పరిష్కారం మీద సమీక్షించి తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.








కామెంట్‌లు (0)