- రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి సంఘాలు
ప్రజాశక్తి- తిరుపతి సిటి: రాష్ట్రవ్యాప్తంగా పారామెడికల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తిరుపతి విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. తిరుపతి యశోదనగర్లో గల వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎఐఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్, ఎన్ఎల్ఎస్ఎ, జిఎన్ఎస్, జిజెఎస్, బిసి విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరై పారామెడికల్ విద్యార్థుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షులు జయచంద్ర, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎన్ మాధవ్ కృష్ణ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన పారా మెడికల్ కోర్సులను ఆరు సంవత్సరాల వరకు సాగదీసే విధానాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ల్యాబ్, ఇంటర్న్‌షిప్ పేరుతో విద్యార్థులతో శ్రమ చేయించుకుంటూ వారికి ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది పారామెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిన్న, ఎన్ఎస్ఎఫ్ నాయకులు నీగురుగట్టు నాగేష్, బిసి విద్యార్థి రాష్ట్ర నాయకులు తిరుమలేష్, ఉత్తరాది విజయ్, జిఎన్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పాలిత్య శివశంకర్ నాయక్, జిజెఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహేంద్ర నాయక్, ఎన్ఎల్ఎస్ఎ నాయకులు సుధీర్, కన్స్యూమర్ ఫోరమ్ నాయకులు సుధారాణి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ విద్యార్థులు శాంతియుతంగా నిరసిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకొని వారిని అరెస్టు చేయడం, వారిపై బల ప్రయోగం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారామెడికల్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని, విద్యా సంవత్సరానికి సంబంధించిన స్పష్టమైన అకడమిక్ కేలండర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, అనిత, న్యాయవాది వెంకటేశ్వర్లు, పారా మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)