శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యారంగ పరిరక్షణకు జెన్‌-జీ ఉద్యమం

1 గంట క్రితం

zen z 1.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 11:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్‌

ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి : విద్యా రంగంలో జవాబుదారీతనం, క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారం అయ్యే వరకు జెన్‌-‌జీ ఉద్యమం ఆగదని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల డ్రామా హాలులో ‘జెన్‌-‌జెడ్‌ మీట్‌’ ‌కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులతో కలిసి విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఐషీఘోష్‌ ‌అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన జెన్‌-‌జీ ఉద్యమంతోపాటు, విద్యారంగంలోనున్న సమస్యలపై మాట్లాడారు. జెన్‌-‌జీ ఉద్యమం ఏదో కాకతాళీయంగా వచ్చిన పోరాటం కాదన్నారు. దశాబ్దకాలంగా విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో నుంచి పుట్టుకొచ్చిన పోరాటమని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పూర్తిగా విద్యారంగంలో మార్పు రాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలకుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా విద్యార్థులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం మలి దశ ఉద్యమం కొనసాగుతోందని వివరించారు. అందులో భాగంగా దేశంలో వివిధ రాష్ర్టల్లో విద్యార్థులు తమ పాఠశాలల్లోనున్న వసతుల లేమిని ఎత్తి చూపుతున్నారని తెలిపారు. బోధనా సిబ్బంది లేరని, అనేక సమస్యలు విద్యార్థులను పట్టిపీడిస్తున్నాయమన్నారు. ఏడు సంవత్సరాల కాలంలో దేశ వ్యాప్తంగా లక్ష పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. ఎస్‌ఎఫ్ఐ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ప్రసన్న మాట్లాడుతూ ఇప్పటికీ స్కాలర్‌‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెం‌ట్‌లు పెండిం‌గ్‌లో ఉన్నాయన్నారు.

విశ్వవిద్యాలయాల్లోనూ బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట అధ్యక్షులు రామ్మోహన్‌, అనంతపురం జిల్లా అధ్యక్షులు గిరి, ప్రధాన కార్యదర్శి ఒ.పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత కళాపరిషత్‌‌లో విద్వాన్‌ ‌విశ్వం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేధావులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలోనూ ఐషీఘోష్‌ ‌మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఒకే విద్యా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి తీసుకొచ్చిన పరీక్షా విధానమే లోపభూయిష్టమైందని ఆమె పేర్కొన్నారు. గతంలో ప్రాంతీయ భాషల్లోనే పరీక్షా విధానం ఉండేదని, ఆ విధానం వల్ల ప్రాంతీయ భాషల్లో పోటీ పడటంతో మెరుగైన ఫలితాలుండేవని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఏకీకృత పరీక్షా విధానంతో కేవలం ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే పరీక్ష రాయాల్సి వస్తోందన్నారు. దీన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్