కార్యకర్తలకు మాజీ సిఎం జగన్ ఆదేశం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ సిఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యర్తలందరూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారని, అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారాయని తెలిపారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు పెచ్చరిల్లిపోతున్నాయని, పోలీసులు కూడా రవాణా చేసే స్థాయికి దిగజారిపోయారని పేర్కొన్నారు. వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయన్నారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారని, అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. టిడిపి కూటమి పాలనతో పోల్చితే గత వైసిపి పాలనే బాగుందని ప్రజలు చర్చించుకుం టున్నారని తెలిపారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని అన్నారు. మరో ఏడాదిలో తాను పాదయాత్ర మొదలుపెడతానని వెల్లడించారు. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయన్నారు.








కామెంట్‌లు (0)