మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగిరిజన హక్కుల రక్షణపై హామీలేనా!

1 గంట క్రితం

tribal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 10:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, అనిత

  • జిఒ నెంబరు 3, 1/70 అమలుకు న్యాయ చిక్కుల సాకు

  • రహస్యంగా అంతర్‌ జ్లా సమన్వయ సమావేశం

ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి జిల్లా) : ​గిరిజన హక్కుల రక్షణపై హామీలతోనే కూటమి ప్రభుత్వం సరిపెడుతోంది. అత్యంత కీలకమైన జిఒ నెంబరు 3, 1/70 చట్టాల అమలు విషయం సహా గంజాయి వంటి మహామ్మారి విషయాల్లోనూ సాగదీత వైఖరినే కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని శంకరన్‌ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన అంతర్‌ ‌జిల్లా సమన్వయ సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, గిరిజనులు పాల్గొనగా..వారు లేవనెత్తిన దాదాపు అన్ని సమస్యలపైనా పరిష్కరానికి కృషి చేస్తాం..సానుకూల నిర్ణయం తీసుకుంటాం’ అన్ని హామీలతోనే అమాత్యులు సరిపెట్టారు. ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులను అనుమతించకుండా రహస్యంగా నిర్వహించడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈ సమావేశం ఒక ఆత్మీయ సమావేశం తరహాలో సాగింది. అల్లూరి జిల్లా కలెక్టర్ టి నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, ఎస్‌‌పి అమిత్ బర్దర్, పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్‌ ‌కుమార్‌, పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, ఎస్‌‌పి మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్, జిఒ నెంబర్‌ 3, 1/70 చట్టం అమలుకు సంబంధించిన అంశాలపై వారి అభిప్రాయాలను తెలిపారు. సమస్యలు, సూచనలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తోందని, హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గంజాయి వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటోందని కొందరు గిరిజన ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తూ గంజాయి నిర్మూలనకు మరింత కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత గంజాయి రహిత సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. అల్లూరి జిల్లాలో ఈగల్ బృందం, పోలీసు శాఖ సంయుక్తంగా గంజాయి నిర్మూలన కోసం కృషి చేస్తూ గ్రామసభలు నిర్వహించడం, విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. గిరిజనుల హక్కుల రక్షణకు గిరిజనుల అభిప్రాయాలు, న్యాయ నిపుణుల సూచనలు, పరిపాలనా అంశాలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, ఎస్‌‌పిలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్