బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐక్య పోరాటాలకు సిద్దమైన రైతు, కార్మిక సంఘాలు

1 గంట క్రితం

tiayat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 10:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రభుత్వం దిగిరాకుంటే ‘భారత్‌ ‌బంద్‌’

  • జాతీయ స‌ద‌స్సులో నిర్ణయం

ప్రజాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిర‌స‌న‌గా కార్మికులు, రైతుల ఐక్య పోరాటాల‌ను బలోపేతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్‌కెఎం నిర్ణయించాయి. బుధ‌వారం నాడిక్క‌డ‌ తల్కటోరా స్టేడియంలో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) సంయుక్త ఆధ్వ‌ర్యంలో జాతీయ స‌ద‌స్సు జ‌రిగింది. ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికులు, రైతులు పాల్గొన్నారు. వివిద కార్మిక సంఘాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. అన్ని గ్రామాల్లో గ్రామసభలు, కిసాన్ పంచాయతీలు నిర్వహించడంతో కార్మికులు, రైతుల ఐక్య పోరాటాన్ని బలోపేతం చేయాల‌ని, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాల‌ని స‌ద‌స్సు పిలుపు ఇచ్చింది. ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే, భారత్ బంద్‌కు పిలుపునిస్తామ‌ని హెచ్చ‌రించింది. డిమాండ్లు అంగీకరించే వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలను నిరంతరం దిగ్బంధిస్తామ‌ని, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు స్వతంత్రంగా ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తాయ‌ని పేర్కొంది. నవంబర్ నాటికి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమ‌ని స‌ద‌స్సులో వక్తలు తేల్చి చెప్పారు. దేశం తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, ప్రధాన ఉత్పాదక శక్తుల ఐక్యత అత్యంత కీలకమ‌ని సదస్సు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దేశీయ, విదేశీ బడా కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాలను అమలు చేస్తూనే ఉంద‌ని, అందువల్ల, సామాన్య ప్రజల, ముఖ్యంగా పేద, వెనుకబడిన తరగతుల వారి జీవితాల్లో అసమానతలు పెరుగుతున్నాయ‌ని తెలిపింది.

​ఆగ‌స్టు 10న జైలు భ‌రో విజ‌య‌వంత కావాలిః ఎల‌మ‌రం కరీం

ఆగస్టు 10న జ‌రిగే జైలు భ‌రో విజయవంతం కావాల‌ని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎలామరం కరీం అన్నారు. జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎంతటి అణచివేత, పోలీసు చర్యలు ఎదురైనా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆందోళ‌న కొనసాగుతుందన్నారు. కార్మికులు, రైతుల ఐక్యతతో మోడీ ప్రభుత్వాన్ని లొంగదీయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ‘‘విద్యార్థుల ఆందోళ‌న‌ ముందు మోడీ లొంగిపోవాల్సి వచ్చింది. ఐదేళ్ల క్రితం సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో జరిగిన చారిత్రాత్మక ఉద్యమంతో వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది’’ అని గుర్తు చేశారు. ‘‘లేబర్ కోడ్లు అనేది బానిసత్వాన్ని అమలు చేయడానికి సిద్ధం చేసిన ఒక నమూనా. లేబర్ కోడ్లు పని గంటలు, గౌరవప్రదమైన వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, సామూహిక బేరసారాల హక్కు వంటి ప్రాథమిక హక్కులను కార్మికుల నుండి దోచుకుంటున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసే వరకు లేబర్ కోడ్ల తుది నిబంధనల నోటిఫికేషన్‌ను కేంద్రం ఆలస్యం చేసింది. ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల్లోనే ఆ కోడ్లను అమలులోకి తెచ్చారు’’ అని విమర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్