అభ్యుదయ శక్తులను ఏకం చేసి బిజెపికి అడ్డుకట్ట వేస్తాం
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు
ప్రజాశక్తి - యంత్రాంగం : సిపిఎం కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా చొరబడి ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శి ఐసీ ఘోష్ అరెస్టు కు మంగళవారం ప్రయత్నించడాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి, ఐషీ ఘోష్‌పై కక్షసాధింపు చర్యలు ఆపాలి, విద్యార్థి ఉద్యమాలపై దాడులు ఆపాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉందని, నిరసన తెలియజేసే వారిపై అక్రమ కేసులు పెట్టరాదని కోర్టులే చెబుతున్నాయని తెలిపారు. అభ్యుదయ శక్తులను ఏకం చేసి బిజెపి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని పలువురు నేతలు హెచ్చరించారు.
విశాఖ మద్దిలపాలెంలోని సీతారాం ఏచూరి భవనం సిపిఎం కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ మాట్లాడుతూ..నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల పెద్ద ఉద్యమం చేశారని, ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ నాయకురాలు ఐషీ ఘోష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు మఫ్టీలో సిపిఎం కేంద్ర కార్యాలయానికి రావడం దారుణమని తెలిపారు. విద్యార్థి నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తగదన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు పాల్గొన్నారు.
విజయవాడ బీసెంట్ రోడ్డులోని మహంతి మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ... శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు అయినప్పటికీ పోలీసులు విద్యార్థులపై అణచివేతకు దిగడం దారుణమన్నారు. ఈ దాడిపై రాష్ట్రంలోని టిడిపి కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మౌనం వహించడం సిగ్గుచేటని.. వైసిపి అధినేత జగన్ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ఎత్తివేసే వరకు పోరాటం ఆపేదిలేదని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్‌లో వామపక్షాలు,దళిత,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ…. దేశంలో నీట్ పేపర్ లీకేజీ సమస్యలపై శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీఛార్జీలు,భాష్పవాయువు ప్రయోగించడం అన్యాయమన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పాల్గొన్నారు. కర్నూలు చౌక్ బజార్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. నంద్యాలలో బొమ్మల సత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతపురంలో టవర్‌క్లాక్ వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం, గుంతకల్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, పెనుకొండ తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం ఆర్ టిసి కాంప్లెక్స్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బొబ్బిలి, రామభ్రదపురం , ఎస్.కోటలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చిట్వేలు, పుత్తూరుల్లో నిరసన తెలిపారు. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల గేటు ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు.








కామెంట్‌లు (0)