సిఎం చంద్రబాబుకు ఇఎఎస్.శర్మ లేఖ
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు, వ్యవసాయ కార్మికులు, స్థానిక ప్రజలకు తగిన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్.శర్మ లేఖ రాశారు. ఆ వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు శాశ్వత జీవనోపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం కోసం సుమారు 2,200 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన ప్రజలకు తగిన ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. ఎపి పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం - 2019 ప్రకారం 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని జిఎంఆర్ సంస్థను ప్రభుత్వం ఆదేశించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలు, వ్యవసాయ కార్మికులు, ఇతర నిర్వాసితులకు ప్రాధాన్యంతో ఉపాధి అవకాశాలు కల్పించాలని, భోగాపురం విమానాశ్రయం ప్రారంభం వల్ల విశాఖ విమానాశ్రయంపై ఆధారపడిన వారి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా భూములు ఇచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం కల్పించడం మంచి నిర్ణయమే అయినప్పటికీ, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పరిహారం, ఉపాధి భద్రత, స్థానికులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని శర్మ తన లేఖలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)