- మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య
- 100 మంది విద్యార్థులు చనిపోయినా స్పందన లేదు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా మారాయని, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని మాజీ ఎంపి డాక్టర్ తలారి రంగయ్య విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సొంత విద్యాశాఖను గాలికొదిలేసి మిగతా అన్ని శాఖల్లో వేలుపెడుతూ, దేశ విదేశాల్లో ప్రచారానికే పరిమితమవుతున్నారని ఆయన మండిపడ్డారు. హాస్టళ్లలో కనీసం బాత్రూమ్‌లకు నీళ్లిచ్చే దిక్కులేక, మౌలిక వసతులు కరువై దాదాపు 100 మంది అమాయక విద్యార్థులు మృత్యువాత పడ్డారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ, విద్యాశాఖలో ముక్కుపచ్చలారని పేద పిల్లల ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. కొద్ది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 మంది విద్యార్థులు మరణించారని, చనిపోయిన వారిలో ఎనిమిది నుంచి 13 సంవత్సరాల లోపు వయసున్న పేద పిల్లలే ఎక్కువగా ఉన్నారని అన్నారు. తాను రాజకీయాల కోసం మాట్లాడటం లేదని, అమాయక విద్యార్థుల ప్రాణాలు పోతున్న ఒక మానవీయ కోణంలో మాట్లాడుతున్నానని తెలిపారు. విద్యార్ధి చనిపోయిన తర్వాత రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని మండిపడ్డారు. బెల్ట్ షాపుల ద్వారా రోజూ లక్షలు దండుకుంటున్న ఎమ్మెల్యే తన సొంతంగా రూ. 50 లక్షలు, ప్రభుత్వం తరపున మరో రూ. 50 లక్షలు.. మొత్తం కోటి రూపాయల పరిహారం మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఇవ్వాలని కోరారు.








కామెంట్‌లు (0)