- హైకోర్టుకు నివేదిక
ప్రజాశక్తి-అమరావతి : వీధి కుక్కల బెడద నియంత్రణకు పలు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 77,146 వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అఫిడవిట్‌లో వివరించారు. అలాగే 80,056 కుక్కలకు టీకాలు వేయించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 షెల్టర్లను ఏర్పాటు చేసి 3,041 కుక్కలను అక్కడికి తరలించామని, మరో 21 షెల్టర్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కుక్కల సంచారాన్ని నియంత్రించేందుకు స్థానిక సంస్థలతో సమన్వయం కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించామని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 9.13 లక్షల యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. వీధి కుక్కలపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలతో సిఎస్ అఫిడవిట్‌ను కోర్టు ముందు సమర్పించారు. కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, సంబంధిత ప్రభుత్వ విభాగాలను కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కోర్టు సహాయకారిగా సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరంను అమికస్ క్యూరీగా నియమించింది. కేసుకు సంబంధించిన పత్రాలన్నింటినీ ఆయనకు అందజేయాలని రిజిస్ట్రీకి సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలు, వృద్ధులు వీధి కుక్కల దాడులకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మే 19న సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. పిచ్చిపట్టి, తీవ్రమైన అనారోగ్యంతో కోలుకోలేని లేదా క్రూరంగా ప్రవర్తించే వీధి కుక్కలకు కారుణ్యమరణం ఇవ్వడానికి అనుమతినిచ్చింది. ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు ధిక్కార చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు దేశంలోని అన్ని హైకోర్టులు సుమోటోగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సుమోటో రిట్ పిటిషన్‌గా నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది.








కామెంట్‌లు (0)