- తరలించాల్సిన కుటుంబాలు 35,037
- తరలించిన కుటుంబాలు 18,179
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని ఊదరగొడుతున్న ప్రభుత్వం పునావాసం విషయంలో మాత్రం పరిహాసం ఆడుతోంది. నీళ్లు నింపితే వారే తరలిపోతారన్నట్లు వ్యవహరిస్తోంది. ఒకవైపు 2027 నాటికి నీటిని నింపుతామని చెబుతున్నా పునవాసం సగం కూడా పూర్తి చేయలేదు. ప్రాజెక్టు ముంపు ఏరియాలో 41.15 మీటర్ల ఎత్తు నిర్మాణానికి 35037 కుటుంబాలను తరలించాల్సి ఉండగా 18179 కుటుంబాలను మాత్రమే తరలించారు. ఇటీవల కేంద్ర బృందం పోలవరం పర్యటన నేపథ్యంలో పునరావాసం తీరుపై నిర్వహించిన సమీక్షలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంక్రీటు డ్యామ్ పనులు 92 శాతానికిపైగా పూర్తి చేసినట్లు చెబుతున్న ప్రభుత్వం పేదల తరలింపుపై శ్రద్ధ వహించడం లేదు. గోదావరికి వరదొస్తే దాదాపు అన్ని గ్రామాలూ మరలా తీవ్ర ముంపునకు గురవుతాయి. ఎల్ నినోతో వరదలు రావని చెబుతున్నా ఒకవేళ వస్తే మాత్రం వేలాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఇంకా 12920 కుటుంబాలను తరలించాల్సి ఉంది. సెప్టెంబరు 17వ తేదీ నాటికి ముంపు ప్రాంతాల నుండి కాలనీలకు 13,737 కుటుంబాలు వెళ్లగా సొంతంగా ఇళ్లు నిర్మించుకుని 4442 మంది మాత్రమే తరలివెళ్లారు. ఫేజ్ 1ఏలో పోలవరం జిల్లాలో 601 కుటుంబాలు, ఏలూరు జిల్లాలో 3337 కుటుంబాలు మొత్తం 3938 కుటుంబాలు, ఫేజ్1బిలో పోలవరం జిల్లాలో 11523, ఏలూరు జిల్లాలో 1388 మొత్తం 12920 కుటుంబాల ప్రజలు మొత్తంగా 16,858 కుటుంబాలను పోలవరం ముంపు ప్రాంతంలోనే ఉన్నాయి. వారిని తరలించే అంశంపై ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. సిఎం, మంత్రి స్థాయిలో జరిగే సమీక్షలన్నీ కాంక్రీటు డ్యామ్, ఈసిఆర్ఎఫ్ నిర్మాణంపైనే జరుగుతున్నాయి తప్ప పునరావాసం పెద్దగా చర్చించడం లేదు. దీంతోపాటు భూ సేకరణకు సంబంధించి 41.15 మీటర్ల ఎత్తు వరకూ ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో 100099.58 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకూ 94796 ఎకరాలను సేకరించారు. భూసేకరణకు రూ.6166 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకూ రూ.5221.69 కోట్లు చెల్లించారు. ఇంకా 5302 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనికోసం రూ.944.46 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేశారు.
విఆర్ పురం, చింతూరు గ్రామాల తరలింపు
ముంపు ప్రాంతంలోని విఆర్ పురం, చింతూరు గ్రామాలు మినహాయించి దాదాపు కాలనీలకు భూమిని గుర్తించారు. ఆ రెండు గ్రామాలకు కూడా సెప్టెంబరు నెలాఖరులోపు భూ గుర్తింపు పూర్తి చేయనున్నారు. దీనికోసం 263 ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇవి కాకుండా మొత్తం ప్రాజెక్టు పరిధిలో గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు 5040 ఎకరాలు అవసరం ఉంది. చింతూరు, విఆర్ పురం గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పునరావాస కాలనీకి 140 ఎకరాలు, భూమికి భూమి ఇచ్చేందుకు 1100 ఎకరాలు మొత్తం 1241 ఎకరాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. ఇదే విషయాలను పిపిఏ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరించారు.








కామెంట్‌లు (0)