బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దళిత, గిరిజన, పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు

19 జులై, 2026

chbr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 06:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఇళ్ల పట్టాలపై ప్రకటనలే తప్ప ఆచరణ లేదు

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు

విజయవాడ : దళితులు, గిరిజనులు, పేదల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు విమర్శించారు. విజయవాడ పాయికాపురం 61వ డివిజన్‌లోని దేవినేని గాంధీపురంలో ఆదివారం బాబురావు, సీపీఎం నాయకులు పర్యటించి స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. సమావేశంలో స్థానికులు మాట్లాడుతూ, గిరిజనులు, దళితులు, పేదలు నివసిస్తున్న కాలనీల పట్ల పాలకులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, గిరిజన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. ఇళ్ల పట్టాల మంజూరుపై ప్రభుత్వాలు మారుతున్నా పరిస్థితిలో మార్పు లేదని, టిడ్కో ఇళ్లు, పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. అలాగే దళిత, గిరిజన సంక్షేమ రుణాలు, ఇతర పథకాల అమలులో తీవ్ర లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా పేదలకు ఇళ్ల పట్టాలు మాత్రం వాగ్దానాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల ఎకరాల భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల కాలనీలకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కుంటి సాకులు చెప్పి అధికారులు, ప్రజాప్రతినిధులు పేదలకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం తగదన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన రహదారులు, సుందరీకరణ పనులకే పరిమితమై శివారు ప్రాంతాలు, పేదలు నివసించే కాలనీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ, నగరపాలక సంస్థల భూములు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొత్త పెన్షన్లు, మహిళలకు రూ.1,500 ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి తదితర 'సూపర్ సిక్స్' హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గిరిజన, దళిత కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువులు పూర్తి చేయలేకపోతుండగా, ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం తప్ప వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. గత మూడు నెలలుగా బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినా పాలకులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల హామీల సాధన కోసం ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, కమిటీ సభ్యులు సీహెచ్ శ్రీనివాస్, స్థానిక నాయకులు మెలిక శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్