- రూ.70 నుండి రూ.80కు విక్రయం
- ప్రజల్లో తీవ్ర ఆందోళన
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పండగ సీజన్‌లో భారీగా పెరుగుతున్న చక్కెర ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.70 నుండి రూ.80కు చేరింది. ఇప్పటికే, ఉల్లి, మిరప ధరలు కన్నీరు పెట్టిస్తుంటే, చక్కెర ధర కూడా అదే బాట పడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సెప్టెంబర్ 1న వెలువడిన మార్కెట్ వివరాల ప్రకారం, రాష్ట్రంలోని రిటైల్ మార్కెట్లలో కిలో చక్కెర ధర రూ.80కు పెరిగింది. ప్రభుత్వ గణాంకాల్లో ఈ ధరను 69 రూపాయలుగా వుంది. జూన్‌లో 45 రూపాయలు మాత్రమే ఉన్న ధర రెండు నెలల్లోనే ఏకంగా 30 రూపాయల వరకు పెరగడం గమనార్హం. ఇందుకు అనేక కారణాలను అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా దేశీయ చక్కెర ఉత్పత్తి అంచనాలు తగ్గడం ఒక కారణంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో పండుగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ పెరగడం, చెరకు పంటపై వాతావరణ పరిస్థితుల ప్రభావం కూడా ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. ఇథనాల్ తయారీకి చెరుకును ఎక్కువగా వినియోగించడం కూడా చక్కెర ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. కొరతను తీర్చడానికి విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో దాని ప్రభావం పెద్దగా లేదని చెబుతున్నారు.
నల్లబజారులోకి నిల్వలు
భారీ మొత్తంలో చక్కెర నల్లబజారులోకి వెళ్లిపోతున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. త్వరలోనే వినాయక చవితి ఉత్సవాలు రానుండడం, ఆ తరువాత దసరా, దీపావళి పండుగలు ఉండడంతో చక్కెర వినియోగం భారీగా పెరగనుంది. దీంతో ఇప్పటి నుంచే హోల్ సేల్ వర్తకులు బ్లాక్ మార్కెట్లోకి మళ్లిస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా సమాచారం ఉందని, అయితే, ఇప్పటివరకు కఠిన చర్యలు ప్రారంభం కాలేదని అంటున్నారు.








కామెంట్‌లు (0)